
కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త
తీవ్ర గాయాలతో స్పృహ తప్పిన బాధితురాలు ఆసుపత్రికి తరలింపు
తాడేపల్లిరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌పైకి తోసివేసిన ఘటన శుక్రవారం తాడేపల్లి గేటు సెంటర్‌లో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడుకు చెందిన వెంకటేశ్వరరావు, అతని భార్య అంజలి కొంతకాలంగా తాడేపల్లిలో నివసిస్తున్నారు. నాలుగేళ్ల కిందట విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల కలసి జీవనం కొనసాగిస్తున్నారు.
అంజలి తాడేపల్లి సలాం సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం బైపాస్‌రోడ్‌లో ఉన్న ఓ హోటల్‌లో పని చేసేందుకు వెళుతోంది. గేటు సమీపంలో భర్త వెంకటేశ్వరరావు తారస పడ్డాడు. అదే సమయంలో రైలు వెళుతుండగా భర్త ఆమె జుట్టు పట్టుకుని వేగంగా వెళుతున్న రైలు మీదకు నెట్టాడు. రైలు ఢీకొనడంతో అంజలి తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108కు ఫోన్‌చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.