
సాక్షి,తాడేపల్లి: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఒడిశాకు చెందిన కార్మికులు,పొట్టకూటి కోసం వచ్చి మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఆదివారం దయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
