
రాయి పడిన క్వారీ ఇదే..
రాయి తీస్తుండగా మీద పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం
బాపట్ల జిల్లా బల్లికురవ మండలం సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ప్రమాదం
ఘటనా స్థలంలో నలుగురు మృతి
ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు మృత్యువాత
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు
కార్మికులంతా ఒడిశాకు చెందిన వారే..
బల్లికురవ/నరసరావుపేట టౌన్/సాక్షి, అమరావతి: గ్రానైట్ క్వారీలో రాయి తీస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. రాయి మీద పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం ఈర్లకొండ వద్ద ఉన్న సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి పనిచేస్తున్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందారు.
పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ వద్ద సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ ఉంది. ఈ క్వారీలో ముడి రాయిని తీసి ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో క్వారీలో రాయి తీసేందుకు తొమ్మిది మంది కూలీలు జాకీలతో పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి తీసే రాయికి పై భాగంలో ఉన్న రాయి దొర్లి కార్మికుల మీద పడింది. దీంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన టుకున దలాయ్ (37), బనమల చెహ్రు (30), భాస్కర్ బిషోయ్ (40), సంతోస్ గౌడ్ (36) అక్కడికక్కడే మృతిచెందారు.
ఎం.సుదర్శన్, కె.నాయక్, శివాగౌడ, దండా బడత్యా (48), ముస్సా జనా (43) తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో దండా బడత్యా, ముస్సా జనా మృతిచెందారు. మిగిలిన ముగ్గురు నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, మైనింగ్ డీడీ రాజశేఖర్, ఏడీ రామచంద్ర పరిశీలించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నాలుగు మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, రెండు మృతదేహాలు నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. వీఆర్వో అశోక్ ఫిర్యాదు మేరకు బల్లికురవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల సంఖ్యపై అనుమానాలు?
క్వారీలో ప్రమాదం జరిగిన సమయంలో ఆరు జాకీలతో జాకీకి ముగ్గురు వంతున డ్రిల్లింగ్ పనులు చేస్తున్నట్లు సమాచారం. కానీ అధికారులు మాత్రం అక్కడ పనిచేస్తున్నది తొమ్మిది మంది మాత్రమేనని, అందులో ఆరుగురు మృతిచెందారని ప్రకటిస్తున్న నేపథ్యంలో మిగిలిన కార్మికులు ఏమయ్యారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మృతుల సంఖ్య విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై విచారణకు సీఎం ఆదేశం
క్వారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై బాపట్ల జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
న్యాయ విచారణ చేయాలి: సీపీఎం
ప్రమాదంపై సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర ది్రగ్భాంతి వ్యక్తం చేసింది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి గల కారణాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి సరైన వైద్యంతోపాటు రూ.10 లక్షల సహాయం అందించాలని కోరారు. క్వారీలో సరైన భద్రతా చర్యలు చేపట్టని యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ క్వారీ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి లేదన్న వార్తలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల చొప్పున పరిహారం
గ్రానైట్ క్వారీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్టు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి చెప్పారు. క్వారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు క్వారీలో మొత్తం 16 మంది ఒడిశా రాష్ట్ర కూలీలు పనిచేస్తున్నారని తెలిపారు.
వర్షం పడడం వల్ల ప్రమాదం జరిగిందని వివరించారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృత్యువాత పడ్డారని, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారని కలెక్టర్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.14లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.పదిలక్షల చొప్పున పరిహారం
క్వారీ యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని
వెల్లడించారు. స్వల్పంగా గాయపడిన వారికీ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున క్వారీ నిర్వాహకుల నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. ఘటనపై విచారణకు
మైనింగ్ శాఖను ఆదేశించినట్టు వెల్లడించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరించనున్నట్టు వివరించారు.