
యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ కు స్వాగతం పలుకుతూ బాదం మాధవరెడ్డి ఫొటోతో ఆయన అనుచరులు వేయించిన ఫ్లెక్సీ (ఫైల్)
టీడీపీ అండ చూసుకుని తండ్రీకొడుకులను హతమార్చిన నిందితుడు
రియల్టర్ల జంట హత్యల కేసులో రివాల్వర్ వినియోగంపై ఆధారాలు
తుపాకీ సంస్కృతితో స్థానికంగా భయాందోళనలు
కూటమి ప్రభుత్వం రాకతో పురివిప్పిన హత్యా రాజకీయాలు
కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్న ఇరు జిల్లాల పోలీసులు
నిబంధనలకు విరుద్ధంగా రెండు జిల్లాల పరిధిలో కేసు దర్యాప్తు
నిందితుడు బాదం మాధవరెడ్డి టీడీపీ వ్యక్తి కావడంతోనే ఇలా చేస్తున్నారని మృతుల తరఫు లాయర్ల ఆరోపణ
దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్‌కు ఏర్పాట్లు
ఒకప్పుడు కక్షలతో రగిలిన పల్నాడు గడ్డపై గత ఐదేళ్లలో శాంతి, సామరస్యం వెల్లివిరిశాయి. సంక్షేమ పథకాలు చేతికంది, పిల్లలు ఉన్నత చదువులవైపు మళ్లడంతో అక్షర చైతన్యం పెరిగింది. పల్లె సీమలలో ఆరోగ్యకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు పురివిప్పాయి. తాజాగా రియల్టర్ల మర్డర్లతో కిడ్నాపింగ్, రివాల్వర్ సంస్కృతి ప్రవేశించింది. పల్నాడును భయం గుప్పెట్లోకి నెట్టేసింది. జంట హత్యల కేసులో పోలీసుల తీరు అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తడంతో తమకు న్యాయం జరిగేనా అంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు.
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన జంట హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో జరిగిన ఈ హత్యల వెనుక కూటమి ప్రజాప్రతినిధుల సహకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కే వీరాస్వామిరెడ్డి, కేవీ ప్రశాంత్‌రెడ్డి తండ్రీకొడుకులు. గత బుధవారం చెల్లని చెక్కు కేసులో నరసరావుపేట కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన వారిని కోర్టు ఎదుట కిడ్నాప్ చేసి బాపట్ల జిల్లా పాతమాగులూరు వద్ద హత్య చేసిన విషయం తెలిసిందే.
నిందితులు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో కిడ్నాప్ చేసేందుకు సాహసించిన తీరు, హత్యలు చేసిన వైనాన్ని పరిశీలిస్తే ప్రభుత్వంలోని పెద్దల అండ చూసుకొని బరితెగించినట్టు తెలుస్తోంది. కేసు నమోదులో కూడా పోలీసుల నిర్లక్ష్యం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన దుండగులు 20 నిమిషాల వ్యవధిలోనే ఇద్దర్నీ హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మృతుల తరఫు న్యాయవాది నాగభూషణ్ ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మృతదేహాలు పాతమాగులూరులో లభ్యమైన కారణంగా సంతమాగులూరు పోలీసులు అక్కడ మర్డర్ కేసు నమోదు చేశారు.
సాధారణంగా కంటిన్యూషన్ అఫెన్స్ జరిగినప్పుడు సంఘటన ప్రారంభమైన స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేయాలి. కానీ జంట హత్యల కేసులో మాత్రం గత కేసులకు భిన్నంగా రెండు జిల్లాల పరిధిలోని పోలీసులు ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇద్దరు స్టేషన్ అధికారుల మధ్య సమన్వయం లోపిస్తే కేసు నీరుగారే ప్రమాదం ఉంది. జంట హత్యల కేసులో ప్రభుత్వం ప్రారంభంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మృతుల తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసుల తప్పిదాన్ని ఎత్తిచూపుతూ కేసు దర్యాప్తును సీబీఐకు బదిలీ చేయాలని హైకోర్టును ఆశ్రయించే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
మాధవరెడ్డి టీడీపీ నాయకుడే..
పట్టపగలు కోర్టు ప్రాంగణం ఎదుట ఇద్దర్ని అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేసి అతి దారుణంగా హతమార్చడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై వస్తున్న విమర్శలను మరుగునపెట్టి.. ఎప్పటిలాగే ఈ ఘటనను కూడా వైఎస్సార్‌సీపీ నెత్తిన రుద్దేందుకు కుట్ర జరుగుతోంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాదం మాధవరెడ్డి గతంలో కొంత కాలం వైఎస్సార్‌సీపీలో ఉన్న విషయాన్ని ప్రచారం చేస్తున్నారు.
అయితే మాధవరెడ్డి ప్రస్తుతం ఏ పారీ్టలో ఉన్నాడు? గత సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ కోసం పని చేశాడు? ఎవరి అండదండలతో ఇంత దారుణానికి ఒడిగట్టాడనే అంశాలను పరిశీలిస్తే అన్ని వేళ్లూ కూటమి ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు 2023 సెపె్టంబర్ 10వ తేదీన అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబును కలసి మద్దతిచ్చిన ఫొటోలను ప్రధాన నిందితుడు మాధవరెడ్డి తన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
దీంతోపాటు యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ కు స్వాగతం పలుకుతూ మాధవరెడ్డి ఫొటోలతో అతని అనుచరులు వేసిన ఫ్లెక్సీలు ఏ పార్టీ వాడో చెప్పకనే చెబుతున్నాయి. ఈ వాస్తవాలను మరుగున పరిచేందుకు కొన్ని పచ్చ పత్రికలు పదేళ్ల క్రితం మాధవరెడ్డి ఉన్న పార్టీ ప్రస్తావన తీసుకువచ్చి ప్రభుత్వానికి మచ్చ లేకుండా చేసేందుకు తెగ ప్రయతి్నస్తున్నాయి. టీడీపీ నేతల అండ చూసుకుని మాధవరెడ్డే స్వయంగా కిడ్నాప్, హత్యల ఘటనలో పాల్గొన్నట్టు అర్థమవుతోంది. తండ్రీకొడుకులను మాధవరెడ్డి బలవంతంగా కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలలో నిక్షిప్తమయ్యాయి.
టీడీపీ నేతలతో సంబంధాలు..
నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన తండ్రీకొడుకులను బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు పరి«ధిలో హత్య చేయడం వెనుక ముందస్తు వ్యుహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. సంతమాగులూరు గ్రామానికి చెందిన నిందితుడు బాదం మాధవరెడ్డికి బాపట్ల, ప్రకాశం జిల్లాలలో అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా పరిధి దాటగానే బాపట్ల జిల్లా ప్రారంభమైన 200 మీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ వెంచర్‌లో హత్యలు చేశారు. ముందస్తు పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడి నుంచి పరారయ్యారు.