
ఏబీసీ దాటేదెలా? ప్రయాణం సాగేదెలా?
బ్రిడ్జి నిర్మాణంతో అద్దంకి రోడ్డులో నిలిచిన రాకపోకలు 40 రోజులపాటు కొనసాగనున్న పనులు డైవర్షన్ రోడ్డు మూసివేసిన కాంట్రాక్టర్ సాగర్ కాలువకు నీటి విడుదల సమయంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ వ్యయప్రయాసలకు గురౌతున్న రైతులు, వాహన చోదకులు
బల్లికురవ: కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులు శాపంగా మారింది. వంతెన నిర్మాణం పేరుతో ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. బల్లికురవ–అద్దంకి ఆర్‌అండ్‌బీ రోడ్డులో వారం రోజులుగా రాకపోకలు స్తంభించిపోయాయి. వల్లాపల్లి–ధర్మవరం గ్రామాల మధ్య అద్దంకి బ్రాంచ్ కాలువ దాటే చోట శిథిలాస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం రెండు నెలల కిందట చేపట్టారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఏబీసీకి నీరు నిలుపుదల చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు ఎన్నెస్పీ అధికారులకు విన్నవించారు. అయితే ఆగస్టు 1వ తేదీ ప్రవాహ ఉధృతికి నీరు దిగువకు రావటంతో పనులకు ఆటంకం ఏర్పడింది.
బంకమట్టితో డైవర్షన్ రోడ్డు..
ఏబీసీ కాలువల్లోని బంకమట్టితో డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ రోడ్డులోనే గ్రానైట్ లారీలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు జారుడు బల్లలా మారింది. ఈ సమస్యపై పత్రికల్లో కథనాలు వచ్చినా.. సమస్య పరిష్కరించకపోగా.. డైవర్షన్ రోడ్డును పూర్తిగా తొలగించారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బల్లికురవ మండలంలో 12 గ్రామాలు, సంతమాగులూరు మండలంలోని 10 గ్రామాలు, అద్దంకి మండలంలోని 9 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
20 కిలోమీటర్ల అదనపు ప్రయాణం
ఈ సమస్య వల్ల అద్దంకి ప్రాంతవాసులు కొమ్మినేనివారి పాలెం, వైదన, కొమ్మాలపాడు మీదుగా నరసరావుపేట వైపు వెళ్లాల్సి వస్తోంది. సుమారు 20 కిలోమీటర్ల అదనపు ప్రయాణం చేస్తున్నారు. బల్లికురవ, సంతమాగులూరు మండల వాసులు అద్దంకి చేరాలంటే కొమ్మాలపాడు, కొప్పరపాడు మీదుగా 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది.
40 రోజులపాటు అవస్థలే..
హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కప్పు దశకు చేరాయి. దీంతోపాటు క్యూరింగ్ పూర్తి కావాలంటే మరో 40 రోజులు పట్టే అవకాశం ఉంది. వ్యవసాయ పనులకు కూలీలను తీపుకెళ్లాలన్నా పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించాలన్నా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వివరించారు. వేసవికాలంలో చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణ పనులు వ్యవసాయ పనుల సీజన్‌లో చేపట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డైవర్షన్ రోడ్డును తొలగిస్తున్న దృశ్యం
అద్దంకి బ్రాంచ్ కాల్వను దాటే చోట నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి
వేసవికాలంలో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. సాగర్ కాలువకు నీటి విడుదల చేసే సమయంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అందరిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. సక్రమంగా రాకపోకలు జరగాలంటే 40 రోజులు పడుతుంది. కనీసం బైకులు, బాటసారులు, రైతులు వ్యవసాయకూలీలు రాకపోకలు సాగించేలా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలి.
–దేవినేని కృష్ణబాబు,
వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్

ఏబీసీ దాటేదెలా? ప్రయాణం సాగేదెలా?

ఏబీసీ దాటేదెలా? ప్రయాణం సాగేదెలా?