
అక్రమార్కులకు అడ్డా తహసీల్దార్ కార్యాలయం
ప్రభుత్వ భూమికి సంబంధించి మూడు పొజిషన్ సర్టిఫికెట్లు అటవీ భూములకూ పాస్ పుస్తకాలు మంజూరు సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు అడిగినా నో..
మార్టూరు: మార్టూరు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తికి చెందిన ఇంట్లో ముగ్గురి పేరుతో ప్రభుత్వ భూమికి సంబంధించి మూడు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో సుమారు రెండు లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆ పార్టీ నాయకులే మీడియాకు వివరాలు అందజేయడం గమనార్హం. ఇదే విషయాన్ని విలేకరులు అధికారిని వివరణ కోరగా తాను డబ్బు తీసుకోలేదని చెప్పారు. కానీ ఆ తర్వాత అదే విలేకరికి ఫోన్ చేసి తాను పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన పట్టా నకలు తనకు వాట్సాప్ ద్వారా పంపమని కోరడం గమనార్హం.
ఫారెస్ట్ అధికారుల ఆదేశాలు బేఖాతర్
బబ్బేపల్లి కొండ.. రెవెన్యూ పరిధి నుంచి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వచ్చిందని సదరు భూమిలో ఎలాంటి ఆక్రమణలు కానీ, తవ్వకాలు కానీ జరపవద్దని జిల్లా ఫారెస్ట్ అధికారులు ఎల్.భీమన్న, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్బాబు గత సంవత్సర కాలంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయితే బబ్బేపల్లి శివారు గ్రామమైన రాజుగారిపాలెం గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కుమార్తె పేరుపై ఈ ఫారెస్ట్ భూమిలో ఓ ఎకరాకు పాస్ బుక్ మంజూరు చేయడం గమనార్హం.
తోటి అధికారులకు తెలియకుండా..
భూ సంతర్పణలకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా కొందరు వివరాలు అడగగా నేటికీ సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో పది కోట్ల రూపాయల విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రస్తుతం ఓ అధికార పార్టీకి చెందిన నాయకుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.
ఫారెస్ట్ భూమిపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం సాగదు
బబ్బేపల్లి రాజుగారిపాలెం గ్రామం ఫారెస్ట్ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకోవడంపై పలుమార్లు హెచ్చరించాం. రెవెన్యూ అధికారులకు ఈ భూమిలో పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చే అధికారం లేదు. ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకున్నా, అనధికార నిర్మాణాలు చేపట్టినా తగు చర్యలు తీసుకుంటాం.
–రమేష్, కూకట్లపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్