
అంతర్ జిల్లాల దొంగ అరెస్ట్
రూ. 16 లక్షలకు పైగా సొత్తు స్వాధీనం
బల్లికురవ: పథకం ప్రకారం నివాస గృహాల్లో బంగారం, వెండి బైక్‌లు చోరీకి పాల్పడ్డ అంతర్ జిల్లాల దొంగను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మేదరమెట్ల–నార్కెట్‌పల్లి నామ్ రహదారిలో బల్లికురవ మండలంలోని గొర్రెపాడు క్రాస్ రోడ్డు వద్ద గుర్తించి పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు తెలియజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కత్తి రవికుమార్ 18వ సంవత్సరం నుంచే చెడు వ్యవసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతూ జైలుకు వెళ్లడం, బెయిల్‌పై రావటం.. మరలా చోరీలకు పాల్పడటం చేస్తున్నాడు. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి మేదరమెట్ల–నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని మండలంలోని రామాంజనేయపురంలో గుంటుపల్లి గురుమూర్తి ఇంట్లోకి ప్రవేశించి 32 గ్రాముల బంగారం, 30 తులాల వెండి చోరీకి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని సంతమాగులూరు సీఐ వెంకటరావు, ఎస్సై వై నాగరాజు పరిశీలించి కేసు నమోదు చేశారు. బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు పర్యవేక్షణలో సీఐ సారథ్యంలో బల్లికురవ, సంతమాగులూరు ఎస్సైలు నాగరాజు, పట్టాభిరామయ్య రెండు టీంలుగా పక్కా వ్యూహంతో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల, పల్నాడు, తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. 102 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. బల్లికురవ, పల్నాడు జిల్లా నాదెండ్ల, దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి రికవరీ చేసినట్లు వివరించారు. విశేష ప్రతిభతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రికవరీ చేయటం పట్ల బాపట్ల ఎస్పీ తుషార్‌డూడీ, డీఎస్పీ రామాజంనేయులు, సీఐ వెంకటరావు, ఎస్సైలు వై.నాగరాజు పట్టాభిరామయ్యను అభినందించి రివార్డులు ప్రకటించారు.