
బాపట్ల జిల్లా: విషజ్వరాలతో దంపతులు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లాలో కలకలం రేపుతోంది. రేపల్లె నియోజకవర్గం నగరం మండలం ఈదుపల్లి గ్రామానికి చెందిన తుమ్మల సుబ్బారావు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందాడు. సుబ్బారావు అంత్యక్రియలు అయిన గంటల్లోనే అతని భార్య మహాలక్ష్మి జ్వరంతో సోమవారం కన్ను మూసింది. దీంతో ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు. కాగా, గ్రామాన్ని విష జ్వరం పట్టి పీడిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
15 రోజుల నుంచి పరిస్థితి ఇలా ఉన్నా ఒక్క అధికారి కూడా గ్రామం వైపు కన్నెతి చూడలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై చిన్నమట్లపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పుష్పేంద్రకుమార్ మాట్లాడుతూ ఈదుపల్లిలో జ్వరంతో దంపతులు మృతి చెందడం తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించి జ్వరపీడితులను గుర్తించామన్నారు. నాలుగు డెంగీ కేసులు ఉన్నట్టు చెప్పారు. మంగళవారం నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.