
సాగుదామా.. ఆగుదామా!
సాగుపై అన్నదాతల్లో అయోమయం ఘోరంగా పతనమైన ధాన్యం ధరలు నష్టపోయిన రైతులు కౌలుకు సాగు చేసేందుకు ముందుకు రాని వైనం పతనమైన కౌలు ధరలు
కారంచేడు: కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడంలో దారుణంగా విఫలమైంది. దీంతో అన్నదాతలు మళ్లీ పంటలు సాగు చేసేందుకు జంకుతున్నారు. ఈ ఏడాది సాగు భూములను కౌలుకు అడిగే వారే కరువయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలోని కర్షకుల దీనావస్థపై కథనం..
పతనమైన కౌలు, ధాన్యం ధరలు:
బాపట్ల జిల్లాలోనే అత్యధిక మాగాణి సాగు ప్రాంతంగా ఉన్న కొమ్మమూరు కాలువ ఆయకట్టు కింద సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగు చేస్తారు. చీరాల, కారంచేడు, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లోని గ్రామాల్లో రైతులు 2270, 2595, 892 రకం విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ రకం విత్తనాలు ఎకరానికి వాతావరణాన్ని బట్టి 30 నుంచి 50 బస్తాల వరకు దిగుబడులు వస్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో బస్తా (75 కేజీలు) ధాన్యం ధర రూ.2400 నుంచి రూ.2600 వరకు అమ్మకాలు జరిగాయి. కూటమి ప్రభుత్వంలో బస్తా ధర రూ.1600– రూ.1700 మాత్రమే ఉంది. అవి కూడా అడిగే వారు లేరు, కొనే వారు అంతకన్నా లేరని అన్నదాతలు వాపోతున్నారు. కౌలు ధరలు కూడా వైఎస్సార్ సీపీ పాలనలో ఎకరం మాగాణి భూములకు 17–18 బస్తాలు ఉంటే, నేడు 11–13 బస్తాల కౌలు మాత్రమే ఉంది. అది కూడా అడిగే వారే కరువయ్యారని రైతులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో సాగు ఖర్చు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.22 వేలు అయితే నేడు రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకు అవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో కర్షకులకు కన్నీళ్లే..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఉన్నారు. సాగుకు ముందే పెట్టుబడి నిధులతో సాగును ప్రారంభించిన అన్నదాతలకు సమయానుకూలంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేవారు. ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు నష్టపోయినా వెంటనే ఇన్స్యూరెన్స్, పంట నష్ట పరిహారాలు అందించారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఏ ఒక్క ఏడాదిలోను రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేవని రోడ్డెక్కలేదు. కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించిన ఏడాదిలోనే అన్నదాతలు పంటలకు గిట్టుబాటు ధరలు లేక, కొనే నాథుడు లేక కన్నీటి పర్యంతమవుతున్నారు.

సాగుదామా.. ఆగుదామా!