
పట్టుబట్టి... ‘కొలువు’ కొట్టి..!
ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై న దంపతులు దూరవిద్యలో చదివినా ప్రతిభతో సాధించిన భర్త ఒకేసారి నాలుగు పోస్టులకు అర్హత పొందిన మరో యువకుడు
పిడుగురాళ్ల రూరల్: ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం నిరంతరం కష్టపడి విజయం సాధించడానికి కొంతమంది మాత్రమే ముందుకు వెళ్తారు. గమ్యం చేరతారు. ఆ కోవకు చెందిన వారే వీరు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన నాగిరెడ్డి, ఉదయశ్రీ దంపతులు ఈ ఏడాది డీఎస్సీ పరీక్షలు రాశారు. వెలువడిన ఫలితాలలో ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. నాగిరెడ్డి పదో తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీ దూర విద్యలో పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా బీఈడీ కూడా చదివారు. సచివాలయ ఉద్యోగాలకు పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. అయినా అంతటితో ఆగలేదు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. తనతోపాటు భార్యను కూడా విద్య వైపు నడిపించి డిగ్రీ, బీఈడీ పూర్తి చేయించారు. ఇద్దరు ఇటీవల డీఎస్సీ పరీక్షలు రాశారు. స్కూల్ అసిస్టెంట్‌గా సోషల్‌లో 73.72 మార్కులతో నాగిరెడ్డి జిల్లా స్థాయిలో 67వ ర్యాంకును, ఉదయశ్రీ కూడా 74.55 మార్కులతో జిల్లా స్థాయి 50వ ర్యాంక్ సాధించారు.
ఒకేసారి నాలుగు పోస్టులకు అర్హత
పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ కూడా డీఎస్సీ పరీక్షలు రాశారు. తాజాగా ప్రకటించిన ఫలితాలలో నాలుగు కేటగిరీలలో ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఎస్జీటీలో 90.74 మార్కులతో గుంటూరు జిల్లా స్థాయిలో నాలుగవ ర్యాంకు కైవసం చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్‌లో 77.22 మార్కులతో గుంటూరు జిల్లా 27వ ర్యాంకు, టీజీటీ సోషల్‌లో 73.35 మార్కులతో జోన్ 3లో 16 ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్‌గా తెలుగులో 67.07 మార్కులతో జిల్లా స్థాయి 71వ ర్యాంకు సాధించారు. 2012–13 విద్యా సంవత్సరంలో మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన హస్సేన్ ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించారు. పాఠశాల ఉపాధ్యాయులు, నాటి తరగతి స్నేహితులు ఆయన్ను అభినందించారు.
మూడు పోస్టులకు...
ఫిరంగిపురం: డీఎస్సీ ఫలితాల్లో మండలంలోని వేములూరిపాడు గ్రామానికి చెందిన జూపల్లి రత్నబాబు మూడు పోస్టులకు అర్హత సాధించారు. ఎంపీపీ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివారు. ఆరు నుంచి పది వరకు అమీనాబాద్‌లోని బీఆర్ హైస్కూలులో, ఇంటర్, డిగ్రీ గుంటూరులోని హిందూ కళాశాలలో, బీఈడీ నరసరావుపేటలో పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ ఎస్‌ఆర్ కళాశాలలో ప్రైవేటు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షల్లో ఎస్‌ఏ ఇంగ్లిష్‌లో 5వ ర్యాంకు, పీజీటీలో 6వ ర్యాంకు, టీజీటీలో 17వ ర్యాంకు సాధించి యువతకు ప్రేరణగా నిలిచారు.

పట్టుబట్టి... ‘కొలువు’ కొట్టి..!

పట్టుబట్టి... ‘కొలువు’ కొట్టి..!