
సాగు పనుల్లో అన్నదాతలు
భట్టిప్రోలు: మందకొడిగా సాగుతున్న వరి నాట్లు ఇప్పుడిప్పుడే ఊపు అందుకుంటున్నాయి. మండలంలోని భట్టిప్రోలు, వెల్లటూరు, పెదపులివర్రు, ఐలవరం తదితర గ్రామాలలోని పొలాల్లో వరినాట్లకు రైతులు సిద్ధమయ్యారు. మండలంలో 15 వేల ఎకరాల్లో వరి సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. వెద పద్ధతిలో సాగు చేపట్టాలని అధికారులు సూచన చేయడంతో మండలంలో సూరేపల్లి, అక్కివారిపాలెం, భట్టిప్రోలు, అద్దేపల్లి తదితర ప్రాంతాల్లో సుమారు 1000 ఎకరాల్లో ఆ మేరకు చేపట్టారు. ప్రస్తుతం ముదురు నారు ఏతకు రావడంతో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా ఇంజిన్ల ద్వారా నీరు పెడుతూ దమ్ము చేస్తూ రైతులు బిజీగా ఉన్నారు. గత 2, 3 రోజులుగా వరినాట్లు వేస్తున్నారు. ఏటా ఆగస్టు నాటికి మండలంలో వరినాట్లు పూర్తయ్యేవి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అక్విడెక్ట్ ఏర్పాటుకు తోడు కాలువలకు నీరు విడుదల చేయడంలో జాప్యంతో ఖరీఫ్ వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా మారడంతో నాట్లు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వారం క్రితమే నారుమడులు ముమ్మరంగా పోశారు. ఇవి ఏతకు వచ్చే సరికి మరో వారం పట్టవచ్చునని అంటున్నారు. మండలంలో ప్రస్తుతం 2 వేల ఎకరాలలో నాట్లు పూర్తికాగా మరో 3 వేల ఎకరాలు వెద పద్ధతిలో సాగవుతున్నాయి. ఇంకా 10 వేల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉంది.
ఊపందుకున్న వరి నాట్లు