
చీరాల రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత
చీరాల రూరల్: చీరాల రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఈగల్ టీమ్, రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఎస్సై సీహెచ్. కొండయ్య, ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చీరాల రైల్వే స్టేషన్‌లో పూరీ నుంచి తిరుపతి వెళ్లే బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ తనిఖీలు చేపట్టారు. జనరల్ బోగీలో లగేజీని తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న పార్సిళ్లు కనిపించడంతో పరిశీలించారు. సుమారు 8 కేజీల గంజాయి వాటిలో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత జీఆర్పీ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైలు తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాపట్ల ఆర్పీఎఫ్ ఎస్సై మనోజ్‌కుమార్ రెడ్డి, చీరాల ఏఎస్సై కె. శ్రీనివాసరావు, బాపట్ల పట్టణ ఏఎస్సై నరసింహమూర్తి, పోతురాజు, చంద్రమౌళి, తిరుపతమ్మ, ఈగల్ టీమ్ దుర్గాప్రసాద్, సతీష్, డాగ్‌స్క్వాడ్ పాల్గొన్నారు.
పూరీ నుంచి తిరుపతి వెళ్లే రైల్లో 8 కేజీలు స్వాధీనం