
అద్దె దుకాణాల కూల్చివేతపై ఆవేదన
సమయం అడిగినా కనికరించలేదని వాపోయిన బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కనీసం స్పందించలేదని ఆరోపణ నడి రోడ్డున పడ్డామని బాధిత కుటుంబాలు కన్నీటిపర్యంతం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రతి నెల అద్దెలు చెల్లిస్తూ వస్తున్న వారిపై దుకాణ యజమాని మనవరాలు దౌర్జన్యానికి దిగారు. షాపులను ఖాళీ చేయాలంటూ రౌడీమూకతో కలిసి ఏకంగా జేసీబీ తీసుకొచ్చి షాపులను కూల్చివేయించారు. ఈ ఘటన శనివారం ఎస్.వి.ఎన్. కాలనీలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీ 4వ లైను ప్రధాన రహదారి మార్గంలో విజయవాడకు చెందిన వెంకటయ్య చౌదరి అనే వ్యక్తికి 778 గజాల స్థలంలో ముందు భాగంలో షాపులు, వెనుక ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ 35 సంవత్సరాల క్రితం కాలనీకి చెందిన రామచంద్రరావు షాపు అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు బ్యాటరీ దుకాణం, సెలూన్ ఏర్పాటు అయ్యాయి. మూడు కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. వెంకయ్య చౌదరికి నెలకు వీరందరూ రూ.35 వేల చొప్పున అద్దె చెల్లిస్తూ వచ్చారు. వీటికి కరెంటు బిల్లులు, మున్సిపాలిటీ పన్నులు తదితరాలను రామచంద్రరావు చెల్లిస్తున్నారు. వెంకయ్య చౌదరికి సంతానం లేకపోవడంతో తూమాటి కృష్ణవేణిని దత్తత తీసుకున్నారు. కృష్ణవేణికి వివాహమై, ఇద్దరు సంతానం ఉన్నారు. వెంకయ్య చౌదరి తన స్నేహితుడైన శ్రీనివాస్, పద్మజలను ఈ ఆస్తికి గార్డియన్లుగా పెట్టారు. 2017లో వెంకయ్య చౌదరి మృతి చెందారు. అప్పటి నుంచి శ్రీనివాస్‌కే అద్దెలు చెల్లిస్తున్నారు. గత జనవరిలో కృష్ణవేణి వచ్చి అద్దెల నగదు తనకు ఇవ్వాలని చెప్పడంతో వారు అదే విధంగా చేస్తున్నారు.
సమయం అడిగినా..
రెండు నెలల క్రితం కృష్ణవేణి వచ్చినప్పుడు దుకాణాలు ఖాళీ చేయాలని, ఈ స్థలం విక్రయించామని చెప్పారు. రెండు నెలల్లో ఖాళీ చేయడం కష్టమని, కనీసం ఏడాదైనా టైం కావాలని చెప్పారు. అవేమీ పట్టించుకోకుండా ఎలాగైనా ఖాళీ చేయాలని హుకుం జారీ చేసి వెళ్లారు. అద్దెదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. స్థలం విలువ ఎంతో చెబితే తామే కొనుగోలు చేసుకుంటామని వారందరూ కోరారు. ఆలోచించుకుని చెబుతామని కృష్ణవేణి వెళ్లిపోయారు. ఈ నెల 17వ తేదీన మళ్లీ వచ్చి దౌర్జన్యంగా షాపులకు తాళాలు వేశారు. బాధితులు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. అద్దెకు ఉన్నవారు ఖాళీ చేయాలని స్టేషన్ అధికారి చెప్పారని బాధితులు వాపోయారు. ఈ నెల 18వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్‌లోనూ వారు ఫిర్యాదు చేశారు. పట్టాభిపురం పోలీసులు కనీసం స్పందించలేదు. శనివారం మధ్యాహ్నం కృష్ణవేణి కుమార్తెనంటూ భూమిక అనే యువతి మరి కొంత మందితో వచ్చారు. జేసీబీతో షాపులు కూల్చివేయించారు. అడ్డుకునే యత్నం చేసే వారిపై మహిళలు, చిన్నారులు ఉన్నారని కూడా చూడకుండా బెదిరింపులకు దిగారు. బాధితులు ఫోన్ చేయగా పట్టాభిపురం హెడ్ కానిస్టేబుల్ వచ్చి గొడవ జరగలేదుగా అంటూ తిరిగి వెళ్లిపోయారని వారు తెలిపారు. కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు.

అద్దె దుకాణాల కూల్చివేతపై ఆవేదన

అద్దె దుకాణాల కూల్చివేతపై ఆవేదన