‘జిల్లా కేంద్రం’పై రాజకీయాలు తగదు | - | Sakshi
Sakshi News home page

‘జిల్లా కేంద్రం’పై రాజకీయాలు తగదు

Aug 25 2025 8:13 AM | Updated on Aug 25 2025 8:13 AM

‘జిల్లా కేంద్రం’పై రాజకీయాలు తగదు

‘జిల్లా కేంద్రం’పై రాజకీయాలు తగదు

అక్రమ కేసులు పెట్టడం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించండి జిల్లా కేంద్రంపై వదంతులుసృష్టిస్తున్నది కూటమి సర్కారే దివ్యాంగులపై కనికరం లేకుండా పింఛన్లు తొలగించడం దారుణం రైతులకు యూరియా, ఇతర ఎరువులూ అందించలేకపోవడం సిగ్గుచేటు ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తీవ్ర ఆగ్రహం

బాపట్ల టౌన్‌: బాపట్ల జిల్లా కేంద్రం మార్పు అంటూ రాజకీయాలు చేయటం సరికాదని మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోనరఘుపతి తెలిపారు. బాపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రాన్ని మారిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఎమ్మెల్యే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మార్పు చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లో ఉంటే ఏంటి... వైదొలిగితే ఏంటి? అంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు బాపట్లకు తలమానికంగా నిలిచిన మెడికల్‌ కళాశాల విషయంలో ఎందుకు తీసుకోలేదో వివరణ ఇవ్వాలన్నారు. రూ. 510 కోట్లతో చేపట్టిన మెడికల్‌ కళాశాలను పూర్తి చేయకుండా ప్రస్తుతం ప్రైవేటుపరం చేసేందుకు కూటమి సర్కార్‌ ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల పూర్తయితే జిల్లాలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. కళాశాల వస్తువులు దొంగలు దోచుకెళ్తున్నారని, రక్షణ కల్పించడంలో కూడా కూటమి సర్కార్‌ విఫలమైందని పేర్కొన్నారు. జిల్లాను ఇచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేసే ముందు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దివ్యాంగులపై కనికరమేదీ?

దివ్యాంగులకు పింఛను తొలగించడంతోపాటు వారు ఆందోళన చేస్తుంటే కనీసం సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. అధికారులు, పాలకులు వారిపై కనికరం కూడా చూపడం లేదని మండిపడ్డారు. బాధితుల పక్షాన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలియజేస్తే కిందకు దించేందుకు వెళ్లిన పార్టీ నాయకులపై పోలీసులు వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. ఆ కేసులను ఎత్తివేయాలన్నారు. దివ్యాంగులకు నోటీసులు జారీ చేసిన అధికారులను సస్పెండ్‌ చేయాలని పేర్కొన్నారు.

ఎరువుల పంపిణీలోనూ పక్షపాతం

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నివర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను యూరియా అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. యూరియా బస్తాల పంపిణీలో కూడా టీడీపీ నాయకులు రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు ఎరువులు అందించాలని తెలిపారు.

పర్యాటకాభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలి

పర్యాటకంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు రూ.98 కోట్లు కేటాయించామని పాలకులు చెబుతున్నారని గుర్తుచేశారు. ఆ నిధులతో తీరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, తీరంలో గతంలో లేని విధంగా ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. చిలకలూరి పేట నుంచి ఓడరేవుకు వెళ్లాల్సిన జాతీయ రహదారి రామాపురంనకు ఎందుకు తరలిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, రాష్ట్ర నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కాగిత సుధీర్‌బాబు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గవిని కృష్ణమూర్తి, నర్రావుల వెంకట్రావు, జోగి రాజా, యల్లావుల సోహిత్‌, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, సుమన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement