నగరం: రేపల్లె నియోజకవర్గం పరిధిలోని నగరం, చెరుకుపల్లి మండలాలలో కూటమి నాయకులు జరిపిన మట్టి అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నగరం, చెరుకుపల్లి మండలాల్లోని పలు గ్రామాలలో కూటమి నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. లక్షలాది రూపాయలు దోచుకున్నారు. పచ్చని పంట పొలాలను చెరువులుగా మార్చివేశారు.
కూటమి నాయకుల అక్రమాలపై ప్రజలు, ప్రజాసంఘాలతోపాటు జై భీమ్‌రావ్ భారత్ పార్టీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం నగరం మండలం పెదమట్లపూడిలో పర్యటించి మట్టి తవ్విన ప్రాంతాలను పరిశీలించారు. కొలతలు వేశారు. తవ్వకాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మైనింగ్ ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్, సర్వేయర్ నాగలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్
రేపల్లె: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.సి.రవిచంద్రకుమార్ చెప్పారు. స్థానిక కళాశాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలలో సైన్‌న్స్ విభాగంలో బీఎస్సీ (కంప్యూటర్ సైన్‌న్స్), బీఎస్సీ (కెమిస్ట్రీ), బీఎస్సీ (ఫిజిక్స్), బీఎస్సీ (జువాలజీ) కోర్సులు, బీఏ (హిస్టరి), బీఏ (ఎకనామిక్స్), బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్‌న్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులందరూ ఆన్‌లైన్‌లో అడ్మిషన్ ప్రక్రియలో పేర్లు నమోదు చేసుకొని, అడ్మిషన్ పొందాలని కోరారు.
24న టీటీసీ పరీక్ష నిర్వహణ
బాపట్ల: ఈ ఏడాది ఆగస్టులో జరిగే టీటీసీ లోయర్ గ్రేడ్–థియరీ రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్థులకు ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తునట్లు డీఈఓ పురుషోత్తం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, వైఎస్సార్ కపడ జిల్లాలో ఉంటాయని తెలిపారు. హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేయించుకోవాలని సూచించారు.
జీజీహెచ్‌లో ఫిర్యాదుల బాక్సు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, హెచ్‌డీఎస్ కమిటీ సభ్యుడు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఫిర్యాదుల బాక్స్‌లో పది ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై హెచ్‌డీఎస్ కమిటీ చర్చించి, పరిష్కరించేందు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
108 కిలోల గంధంతో అభిషేకార్చన
నగరంపాలెం: స్థానిక అరండల్‌పేట శ్రీఅష్టలక్ష్మీ మందిరం కోటి కుంకుమార్చనలో భాగంగా శ్రావణ మంగళవారం స్వామి, అమ్మవారికి విశేష పూజలు, శ్రీచక్ర మహామేరుకు విశేష అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం 108 కిలోల గంధంతో విశేష అభిషేకార్చన భక్తిశ్రద్ధలతో చేపట్టారు. హారతులు, మంత్రపుష్పం అనంతరం కుంకుమార్చనకు హాజరైన వారు స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు నిర్వాహకులు అందించారు. నక్షత్ర హారతి, మంత్రపుష్పం చేపట్టగా, నిర్వాహకులు మర్రిపాటి ప్రసాద్‌శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మట్టి అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ విచారణ