
ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు చేతుల్లో పెట్టొద్దు!
బాపట్ల: ఆర్టీసీ స్థలాన్ని షాపింగ్ మాల్స్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 137ను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.టి.వలి డిమాండ్ చేశారు. బాపట్లలోని ప్రభుత్వ పెన్షనర్స్ బిల్డింగ్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం కోసం అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజా రవాణా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. విజయవాడ నగర నడిబొడ్డునున్న గవర్నర్‌పేట డిపోలు, పాత బస్టాండ్‌కు చెందిన నాలుగు ఎకరాల స్థలం సుమారు రూ.400 కోట్ల విలువ చేస్తుందని, దాన్ని లులు షాపింగ్ మాల్‌కు అప్పగించడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రెండు డిపోల్లో 200 బస్సులు, 1100 మంది ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా ప్రైవేట్ వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చడాన్ని ప్రజలు సహించరని వలి విమర్శించారు.బాపట్ల జిల్లా మాజీ కార్యదర్శి వై.ఎస్. రావు మాట్లాడుతూ 1959లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన గజం రూ.16 ధరతో, సుమారు రూ.4.60 లక్షలకు ఆర్టీసీ యాజమాన్యం ఈ భూమిని కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇంత విలువైన ప్రజా ఆస్తిని కొద్ది మంది వ్యాపారవేత్తల చేతుల్లోకి ఇవ్వడం చరిత్రలోనే పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. సమావేశంలో బాపట్ల జిల్లా కార్యదర్శి పి.కమలాకర్‌రావు, నెల్లూరు జోనల్ మహిళా నాయకురాలు పి. రజిని, ఎం.పి. కుమార్, బాపట్ల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. చింపనయ్య, బాపట్ల డిపో ప్రెసిడెంట్ టి. చంద్రశేఖర్, సెక్రటరీ వై.ఎన్. రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.ఎస్.రావు పాల్గొన్నారు.
ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.టి.వలి