కురబలకోట: దేశ భవిష్యత్తు ప్రణాళికలకు పునాది జనగణన అని, ప్రతి కుటుంబ సమాచారం ఖచ్చితంగా నమోదైతేనే వివిధ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సరైన దిశా నిర్దేశం సాధ్యమవుతుందని అన్నమయ్య జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేష్ అన్నారు. గురువారం మండలంలోని విశ్వం కళాశాలలో రెండు రోజుల పాటు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న జనగణన–27 శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి తప్పులకు ఆస్కారం లేకుండా జనగణన ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. జనగణనపై క్షేత్ర స్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో ఎన్యుమరేటర్లకు సమగ్ర శిక్షణ అందించి ఇంటింటికి వెళ్లి వాస్తవ వివరాలను సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనగణనలో భాగంగా 40 రకాల ప్రశ్నలతో పాటు అనుబంధ ప్రశ్నలు ఉంటాయన్నారు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సీఎంఎంఎస్ డిజిటల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు.
జనవరి 10 నుండి 24 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారన్నారు. జనవరి 25 నుండి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తారన్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 8 నుండి 10 ఇండ్ల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. 800 మంది జనాభాకు ఒక ఎన్యుమరేటర్ ను కేటాయించారన్నారు. ఫిబ్రవరి 28న రాత్రి 12 గంటల సమయానికి ఇళ్లు లేకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి వివరాలను కూడా ప్రత్యేకంగా నమోదు చేస్తారన్నారు. జరిగిన జనగణనపై మార్చి ఒకటి నుండి 5 వరకు పునశ్చరణ నిర్వహిస్తారన్నారు. పీలేరు, రాయచోటి ఆర్డీఓలు విజయలక్ష్మి, శ్రీనివాసులుతో పాటు జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎస్‌ఓలు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేష్


