● మూడేళ్లుగా వరుస కరువులతో
జిల్లా రైతాంగం కుదేలు
● పంట నష్టపరిహారంలో
పైసా విదల్చని వైనం
● 2024 నుంచి 2026 వరకు
53 మండలాల్లో కరువు ప్రకటన
2025 ఖరీఫ్‌లో రెండెకరాల్లో వేరుశెనగ సాగు చేస్తే వర్షాభావంతో పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడిలో పైసా రాలేదు. అధికారులు పరిహారం వస్తుందన్నా, ఏడాది గడిచినా సాయం అందలేదు. ఈ ఖరీఫ్‌లోనూ అప్పులు చేసి టమాట సాగు చేసి నష్టపోయాను.
– రామచంద్ర, రైతు, నిలువురాతిపల్లె (పీటీఎం)
2025 ఖరీఫ్‌లో అప్పులు తెచ్చి ఐదెకరాల్లో వేరుశెనగ వేశాను. వర్షాలు లేక కనీసం ఎకరా పంట కూడా చేతికి రాలేదు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశగా ఎదురుచూసినా ఇప్పటివరకు ఆర్థిక సాయం అందలేదు.
– రఘునాథరెడ్డి, రైతు, చెన్నామర్రి (కురబలకోట)
గత ఖరీఫ్‌లో రూ.1.50 లక్షల పెట్టుబడితో ఐదెకరాల్లో వేరుశెనగ సాగు చేశాను. వర్షాభావంతో ఎకరాకు మూడు బస్తాల దిగుబడే వచ్చింది. పెట్టుబడి తిరిగి రాక, ఏడాది గా పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నాం.
– వెంకటనర్సు, రైతు, ఎద్దులవారికోట (తంబళ్లపల్లె)
గత రెండు ఖరీఫ్ సీజన్లతో పాటు ఫెంగల్ తుఫాను పంట నష్టపరిహారం ఇంకా మంజూరు కాలేదు. ప్రస్తుత ఖరీఫ్ కరువు, పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
– హరిప్రియ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
మదనపల్లె: 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి వరుస కరువులతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2024 ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు మూడేళ్లుగా జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 2024 ఖరీఫ్‌లో 19, 2025లో 9, 2026లో 25 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది.
ప్రణాళిక ఏదీ.. పరిహారం ఏదీ?
కరువును గుర్తించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికను అమలు చేయాలి. రైతులకు అవసరమైన విత్తనాలు, సాగు సాయం అందించడంతో పాటు, వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పంట నష్టపరిహారం చెల్లించాలి. గత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన వెంటనే పరిహారం అందించి రైతులకు అండగా నిలిచారు.
చేయూత కరువు..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం మూడేళ్లుగా కరువు వేధిస్తున్నా రైతుల కోసం ఒక్క సహాయక కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు. పంటలు వేయలేని దుస్థితిలో ఉన్న రైతులకు పరిహారం కింద ఒక్క పైసా కూడా విదల్చలేదు. కనీస చేయూత అందించకుండా రైతులను ఆర్థికంగా చితికిపోయేలా చేసి, తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


