– పర్యవేక్షణాధికారులు లేకుండానే
నిర్వహిస్తున్నారని కార్మికుల అభ్యంతరం
పులివెందుల రూరల్: పులివెందుల ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్ల డ్యూటీ చార్ట్ కౌన్సెలింగ్ ప్రక్రియపై వివాదం నెలకొంది. ఏటా నిర్వహించే ఈ ప్రక్రియను నిబంధనల ప్రకారం సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, చీఫ్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో చేపట్టాలి. అయితే, గత కొంతకాలంగా ఈ రెండు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పైగా, కౌన్సెలింగ్ ఆదేశాలు జారీ చేసిన ఉద్యోగి సైతం సెలవుపై వెళ్లడంతో ప్రక్రియ నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. పర్యవేక్షణాధికారులు అందుబాటులో లేకుండానే హడావుడిగా కౌన్సెలింగ్ చేపడితే భవిష్యత్తులో అక్రమాలు, వివాదాలు తలెత్తే ప్రమాదముందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు అధికారుల సమక్షంలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని, లేదంటే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి ఆర్టీసీ యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
హుండీ ఆదాయం రూ.6.93 లక్షలు
ఒంటిమిట్ట (రాజంపేట): ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను పరకామణి సిబ్బంది లెక్కించారు. దీని ద్వారా టీటీడీకి రూ.6,93, 885 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఏఈవో రవి ఒక ప్రకటనలో తెలిపారు.


