● రొంపిచెర్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సుజాత రాజీనామా
రొంపిచెర్ల: కూటమి పార్టీల్లో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, నేతలు తమను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రొంపిచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్‌పర్సన్ సుజాత గురువారం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన సుజాత గత 15 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను రొంపిచెర్ల ఏఎంసీ చైర్‌పర్సన్‌గా నియమించారు. అయితే, పదవి ఇచ్చినప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో తనకు కనీస గుర్తింపు లేకుండా పోయిందని ఆమె ఒక ప్రకటనలో వాపోయారు.ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ కూటమి నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు:నియోజకవర్గంలో ఎక్కడ సమావేశాలు జరిగినా ఏఎంసీ చైర్‌పర్సన్‌గా ఉన్న తనకు వేదికపై కూర్చునే అర్హత కూడా లేకుండా చేశారని, ఎక్కడో సామాన్య జనాల్లో చివరన కూర్చునే పరిస్థితికి దిగజార్చారని ఆవేదన చెందారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కష్టపడి పనిచేసే తమపైనే పార్టీ అధిష్టానానికి తప్పుడు సమాచారం అందిస్తూ అణగదొక్కే ప్రయత్నం చేయడం భావ్యం కాదన్నారు.గతంలో బీజేపీ నాయకులు మాదాల లోకేష్ సహకారంతో పార్టీలో మంచి గుర్తింపు ఉండేదని, కానీ ప్రస్తుతం కేవలం అగ్రవర్ణాల వారికే ప్రాధాన్యత ఇస్తూ దళితులను విస్మరిస్తున్నారని సుజాత ఆరోపించారు. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో తాము పార్టీలో గానీ, పదవిలో గానీ కొనసాగలేమని స్పష్టం చేశారు. అందుకే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తానని సుజాత పేర్కొన్నారు.


