మదనపల్లె టౌన్: న్యూమోనియా వ్యాధిపై అవగాహన ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఉషశ్రీ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గురువారం ఆమె మదనపల్లెలో పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడుతూ.. నేటి నుంచి ఫిబ్రవరి 28 వరకు జిల్లా వ్యాప్తంగా సాన్స్ (న్యూమోనియాను అరికట్టడానికి సామాజిక అవగాహన– చర్యలు) కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఐదేళ్ల లోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణం న్యూమోనియా అని, అవగాహనతో మరణాలను తగ్గించవచ్చని తెలిపారు. న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్ అని, దీనివల్ల గాలి తిత్తులు వాచి ద్రవం చేరుతుందని వివరించారు. జ్వరం, ఊపిరి ఆడకపోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని సూచించారు. ఆరు నెలలు తల్లిపాలు, సకాలంలో టీకాలు, పరిశుభ్రత, పోషకాహారంతో న్యూమోనియాను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఏటీఓ డాక్టర్ రాధిక, డీపీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, పరిపాలన అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు.


