కి లో ధరలో వ్యత్యాసం..
ఆసియాలోనే అతిపెద్ద టమాట మార్కెట్‌గా ఖ్యాతిగాంచిన ‘మదనపల్లె మార్కెట్’ దళారుల గుప్పిట్లో చిక్కి ‘వెల’విలబోతోంది. వ్యాపారులంతా ట‘మాట’మీద ఉంటూ కృత్రిమంగా ధర తగ్గిస్తుండడంతో రైతు కష్టం దళారుల పాలవుతోంది. సమీక్షించాల్సిన మార్కెటింగ్ శాఖ ‘మామూళ్ల మత్తు’లో నిదురోతోంది.
● మదనపల్లె మార్కెట్లో
టమోటా ధర తగ్గుదల
● నష్టపోతున్న రైతులు
● కనీసం సమీక్షించని మార్కెటింగ్ శాఖ
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్‌కు టమాట తెస్తున్న రైతులు ఊహించని స్థాయిలో ఆర్థికంగా నష్టపోతున్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా బయట మార్కెట్‌లో ధరలు బాగున్నా.. మార్కెట్‌లో వేలానికి వచ్చేసరికి ధర పాతాళానికి పడిపోవడం చూసి దిగాలు పడుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇదే మార్కెట్లో ఇప్పుడున్న మండి యజమానులే, ఇప్పటి వ్యాపారులే టమాట కొనుగోలు చేశారు. కానీ అప్పుడు పలికిన ధరలు ఇప్పుడు పలకడం లేదు, ఎందుకు అని అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి స్పష్టమైన ఉదాహరణ గురువారం మదనపల్లె మార్కెట్లో పలికిన ధరలే. సరిగ్గా ఇదే రోజు 2025 నవంబర్ 12న ఇదే మదనపల్లె మార్కెట్లో టమాటా ధర కిలో రూ.41 పలికింది. ఇప్పుడు రూ.17 మాత్రమే పలికింది. బహిరంగ మార్కెట్లో ధరల మోత మోగుతుంటే.. రైతులు విక్రయిస్తున్న పంటకు మాత్రం గతంలో పలికిన ధర కూడా పలకడం లేదు. మదనపల్లె మార్కెట్‌లో టమాట రైతులు నష్టపోతున్న పరిస్థితిని పరిశీలిస్తే చేదు వాస్తవాలు వెలుగుచూస్తాయి. గత నవంబర్ 12న అత్యధిక ధర కిలో రూ.41 పలికితే, ఈరోజు కిలో రూ.17 పలికింది. అంటే రూ.24 తేడా.
తగ్గాయా.. తగ్గించారా
మదనపల్లె మార్కెట్‌లో మండీల యజమానులు, వ్యాపారులు ఏళ్ల తరబడి ఉంటున్న వారే. సాధారణంగా నవంబర్ నెల టమాటకు అన్ సీజన్‌గా భావిస్తారు. టమాటా దిగుబడి తక్కువగా వస్తుంది. మార్కెట్‌కు వచ్చే దిగుబడి ఆధారంగా ధరలు పెరుగుదల, తగ్గుదల ఉండే అవకాశం ఉంటుంది. కానీ గత ఏడాది ఇదే నెలలో ధరలు.. ఇప్పుడు పలికిన ధరల మధ్య భారీగా తేడా ఉందని మార్కెటింగ్ శాఖ నివేదికలే స్పష్టంగా చెబుతున్నాయి. ఈ పరిస్థితులు గమనిస్తే అందరూ సిండికేట్ గా మారి ధరలు తగ్గించారా అన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఇంతజరుగుతున్నా మార్కెట్ అధికారులు కానీ, ఆ శాఖ ఉన్నతాధికారులు గాని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం సమీక్షించడం కానీ, ధరలు కోల్పోవడంపై రైతులు నష్టపోతున్న పరిస్థితులపై తీసుకుంటున్న చర్యలు ఒక్కటి లేకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూపాయి తగ్గినా లక్షల్లో నష్టం
టమాట రైతుల పరిస్థితి మిగతా పంటలు సాగు చేస్తున్న రైతుల కంటే దయనీయమైనది. ఎకరాకు రెండు లక్షలకు పైబడి పెట్టుబడి పెట్టి, కష్టపడి పంట తీస్తే ధరలు లేక రైతులు కన్నీటి పర్యంతమైన రోజులు ఉన్నాయి. రైతుకు చెల్లించే ధరలో ఒక రూపాయి తగ్గిన ఆ ప్రభావం లక్షల రూపాయల్లో చూపిస్తుంది. తర్వాత కోట్లలో ఉంటుంది. కాబట్టి ఈ ధరల పరిస్థితిపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉంది.
నవంబర్ 2025 2026
(అత్యల్పం–అత్యధికం)
2 15–28 13–30
3 15–28 17–23
4 16–29 12–23
5 15–28 14–27
6 14–27 12–26
7 15–28 11–26
8 15–29 9–18
9 14–27 9–20
10 16–27 12–23
11 20–37 9–20
12 25–41 7–17


