పుంగనూరు చేసిన పాపమేంటి.. చంద్రన్నా | - | Sakshi
Sakshi News home page

పుంగనూరు చేసిన పాపమేంటి.. చంద్రన్నా

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

మున్సిపాలిటీకి రెండేళ్లలో పైసా లేదు.. ఇప్పుడు ‘వర్చువల్‌’ షూటింగ్‌లు

పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న రాజకీయ కక్షను ఇక్కడి సామాన్య ప్రజలపై చూపిస్తున్నారు. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం.. పుంగనూరు ప్రజల కళ్లెదుటే ప్రవహిస్తున్న కృష్ణా జలాలను స్థానిక చెరువులకు అందించే విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోంది. దశాబ్దాలుగా పెద్దిరెడ్డి కుటుంబం ఎదుగుదలపై ఉన్న రాజకీయ వైరంతో చివరకు నీటిపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతూ.. పుంగనూరు నుంచి నీటిని నేరుగా కుప్పంకు తరలిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన సొంత నియోజకవర్గ ప్రయోజనాల కోసం సీఎం ప్రతిపక్ష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలను బలిచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాలువకు పేరు మాత్రమే.. నేలను తడపని కృష్ణమ్మ

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగమైన సత్యసాయి జిల్లా చెర్లోపల్లె రిజర్వాయర్‌ ప్రారంభం నుంచి పలమనేరు నియోజకవర్గం సరిహద్దుల వరకు సాగే ప్రధాన కాలువకు ‘పుంగనూరు ఉపకాలువ’ అని పేరు పెట్టారు. అయితే ఈ కాలువకు పేరు మాత్రమే పుంగనూరు అని ఉంది కానీ, అందులో ప్రవహించే కృష్ణమ్మ మాత్రం ఇక్కడి నేలను తడపడం లేదు. పుంగనూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పుంగమ్మ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రధాన చెరువులకు కృష్ణా జలాలను అందించాల్సి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుతో పాటు మండలంలోని అన్ని చెరువులను కృష్ణా జలాలతో ముందే నింపి, ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా ప్రజల దాహం తీర్చారు. కానీ ప్రస్తుతం పుంగనూరు మీదుగానే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పారుతున్నా.. ఇక్కడి చెరువులకు మాత్రం చుక్క నీరు కూడా మళ్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం కుప్పం నియోజకవర్గానికి తరలించుకుపోతోందని స్థానికులు మండిపడుతున్నారు.

నీళ్లు ఎప్పుడిస్తారు?.. ఆందోళనకు సిద్ధమవుతున్న ప్రజలు

‘మా కళ్లెదుటే నీళ్లు పారుతుంటే.. పుంగనూరు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు, పుంగమ్మ చెరువు, రాయలచెరువు తదితర ప్రధాన జలాశయాలకు కృష్ణా జలాలు ఎప్పుడు విడుదల చేస్తారు?’ అంటూ స్థానిక ప్రజలు, రైతులు అధికారులను మరియు పాలకులను నిలదీస్తున్నారు. తాగునీటి ఎద్దడి ముంచుకొస్తున్న తరుణంలో తక్షణమే నీటిని విడుదల చేయకపోతే, కాలువలను అడ్డుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి జనం సిద్ధమవుతున్నారు. ఈ నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం కాలువల పొడవునా భారీగా పోలీసు బలగాలను దించి పహారా కాయిస్తోంది.

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా.. పుంగనూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కనీసం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు మినహా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రత్యేక నిధులూ కేటాయించలేదు. అయితే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో నిధులు ఇవ్వకుండానే కేవలం ‘వర్చువల్‌’ విధానం ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ఎన్నికల స్టంట్లు ప్రారంభించడంపై జనం మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా, కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే కూటమి నేతలు ప్రగల్భాలు పలుకుతూ సరికొత్త ‘షూటింగ్‌లు’ ప్రారంభించారని, వారి నాటకాలు చూసి ప్రజలే ఎద్దేవా చేస్తూ నవ్వుకుంటున్నారని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement