వినాయక చవితి వేడుకల అనంతరం భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేరాల్సిన బొజ్జ గణపయ్య.. నిమజ్జనానికి నీరు లేక నేల మీదనే ఉండిపోవాల్సి వచ్చిన ఈ హృదయ విదారక దృశ్యం చిత్తూరు జిల్లా పులిచెర్ల పరిధిలో వెలుగుచూసింది. స్థానిక పులిచెర్ల సమీపంలోని చెరువులో నిమజ్జనం చేయాల్సిన విగ్రహాన్ని, అక్కడ నీటి చుక్క లేకపోవడంతో చేసేదేమీ లేక భక్తులు గట్టు మీదనే ఉంచేసారు.ఆచారాల ప్రకారం నీటిలో కలపాల్సిన విఘ్నేశ్వరుడు ఇలా వెలవెలబోతూ గడ్డ మీదనే కొలువుతీరాల్సి రావడం స్థానిక భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. ‘దేవుడా క్షమించు.. కృష్ణమ్మ నీరు లేక నిన్ను గంగమ్మ ఒడికి చేర్చలేకపోతున్నాం’ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవు కోరలు చాచడంతో కళ్లెదుటే జలాశయాలు ఎండిపోయాయని, దానికి ఈ ఘటనే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోందని స్థానికులు వాపోతున్నారు.
– పులిచెర్ల (కల్లూరు)


