● పొలీసుల అదుపులోనే నిందితుడు?
● మా బిడ్డను చంపేశారా అంటు తల్లిదండ్రుల ఆవేదన
● మిస్టరీగా మైనర్ బాలిక కిడ్నాప్ కేసు
గుర్రంకొండ : ఇరవై రోజుల కిందట అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందోనని వేలాది మంది ప్రశ్నిస్తున్నారు. బాలికను కిడ్నాప్ చేసిన నిందుతుడు ఐదు రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్నాడని, బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాలిక మాత్రం కనిపించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. కిడ్నాప్ చేసిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉంటే మరీ బాలిక ఏమైనట్లు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మా బిడ్డను చంపేశారా అంటూ బాలిక తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాలిక కిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది.
మండలంలోని టి.రాచపల్లె పంచాయతీ గంగిరెడ్డిగారిపల్లెకు చెందిన రామచంద్ర, అమరావతి కుమార్తె (17) ఈ నెల 5వ తేదీ నుంచి కనిపించడం లేదు. బాలిక ఆచూకీ కోసం వారం రోజుల పాటు గాలించినా ఫలితం లేదు. దీంతో ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రెడ్డిమోహన్ బాలికను కిడ్నాప్ చేశాడని అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు ఈ నెల 12న స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడిచే కొద్దీ కేసు దర్యాప్తులో పురోగతి కనిపించకపోవడంతో బాలిక తండ్రి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను మదనపల్లె ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తనకు న్యాయం చేయలేదంటూ బాలిక తల్లిదండ్రులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 22న బాలిక తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున గుర్రంకొండకు చేరుకొని బస్టాండులో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నాలుగు గంటల పాటు నిర్వహించిన ధర్నాతో ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారిపై రొడ్డుకిరువైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. చివరకు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ధర్నా వద్దకు చేరుకొని బాలిక తల్లిదండ్రులతో చర్చించి బాలికను తప్పకుండా తీసుకొస్తామని ఇందుకోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. బాలిక కిడ్నాప్ కేసు చిక్కువీడని ప్రశ్నగా మిగిలిపోయింది. బాలికను కిడ్నాప్ చేశాడని అనుమానిస్తూ ఆటోడ్రైవర్ రెడ్డి మోహన్‌ను ఆరు రోజుల క్రితం పోలీసులు ఆదుపులోకి తీసుకొన్నట్లు బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఆరు రోజులుగా బాలికను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ ఎందుకు నోరు మెదపడం లేదనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆటో డ్రైవర్ బాలికను తనవెంట తీసుకెళ్లి ఉంటే ప్రస్తుతం అతనితో ఎందుకు రావడం లేదు, అసలు బాలిక ఉందా.. ఉంటే ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు బాలిక తల్లిదండ్రులు సంధిస్తున్నారు. ఒక వేళ తమ బిడ్డను ఏమైనా చేశారా అని రోదిస్తున్నారు. ఇటీవల ఆటోడ్రైవర్‌కు హైదరాబాద్ నుంచి ఓ ఆర్టీసీ కండక్టర్ సెల్ నుంచి బాలిక ఫోన్ చేసినట్లు సమాచారం. పోలీసులు ఈ నెంబరును సంప్రదించగా ఓ బాలిక తన ఇంటికి ఫోన్ చేసుకోవాలని చెప్పి ఫోన్ తీసుకొని కాల్ చేసినట్లు కండర్టర్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిందని బాలిక కుడా అక్కడికే వెళ్లి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక హైదరాబాద్‌కు ఎందకు వెళ్లింది. ఎవరు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విజయవాడకు ఎందుకు వెళ్లి ఉంటుందని గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గ్రామస్తులు విజయవాడకు కూడా వెళ్లి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. కిడ్నాపర్ పోలీసుల అదుపులో ఉండగా బాలిక బయట ప్రాంతాల్లో ఎందుకు ఉంటుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బాలిక కిడ్నాప్ కేసు మిస్టరీగా మిగిలిపోతుండడం గమనార్హం.


