సదుం : కోడలు దాడి చేయడంతో అత్త మృతి చెందిన సంఘటన సదుం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పాలమంద పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన కృష్ణమ్మ తన కుమారులకు ఆస్తులు పంచారు. నగదు విషయమై ఈ నెల 10న పెద్ద కోడలు రమణమ్మ ఘర్షణ పడి, అత్తపై దాడి చేసింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడటంతో తిరుపతి రుయాలో చికిత్స కోసం ఆమెను చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
జనసేన కార్యకర్త
విజయ్‌పై దాడి
రాయచోటి : రాయచోటిలో మంగళవారం రాత్రి జనసేన కార్యకర్త బుల్లెట్ విజయ్ పై కూటమి పార్టీలోని మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిలో పాత రాయచోటికి చెందిన విజయ్ తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. రాయచోటి పట్టణం సంజీవనగర్ కాలనీలోని సాయిబాబా వినాయక విగ్రహం వద్ద ఘర్షణ చోటు చేయనుకుంది. విగ్రహం వద్ద అన్నదానం జరిపించిన విజయ్ పై మరో వర్గానికి చెందిన గ్యాంగ్ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగు రోజుల కిందట ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. మంగళవారం రాత్రి దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాల పాలైన విజయ్‌ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కూలి చెల్లింపుపై ఘర్షణ
ముద్దనూరు : స్థానిక ఎస్సీ కాలనీలో పెయింటింగ్ కూలి డబ్బులు చెల్లింపు విషయమై ఘర్షణ పడటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ త్రివేది సమాచారం మేరకు.. ఈ నెల 19వ తేదీన ఎస్సీ కాలనీలో లక్ష్మీనరసింహులుకు రూ.2500 కూలి డబ్బులు చెల్లించపోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో సుధాకర్ మరో ఇద్దరు.. నరసింహులుపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
టౌన్ బ్యాంక్‌లో డీసీఓ విచారణ
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్‌లో చోటు చేసుకున్న అవకతవకల ఆరోపణలపై జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య మంగళవారం విచారణ చేపట్టారు. బ్యాంక్ సీఈఓ నిరంజన్‌రెడ్డిని విచారణ చేశారు. బ్యాంక్ రికార్డులు, ఖాతాదారుల సమాచారం ఎలా బయటికి వెళుతోందని తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీ సమాచారంపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, సంబంధం లేని వారికి పాస్‌వర్డ్ ఇవ్వొద్దని తెలిపారు. జరిగిన అవకతవకలను క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు కేసు నమోదు చేయాలని సూచించారు.


