వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య

Sep 23 2026 1:37 AM | Updated on Sep 23 2026 1:37 AM

సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట మండలం నాయనబావి గ్రామంలో ఈ నెల 20న రైతు జి.గోపాల్‌ రెడ్డి (40) హత్య మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో తెలియజెప్పింది. తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య భావించగా, తండ్రి చనిపోతే ఆస్తి వస్తుందనుకున్న కొడుకు ఆశకు నిండు ప్రాణం బలైంది. ఈ దారుణ హత్యతో నాయనబావి గ్రామం ఉలిక్కిపడగా, గ్రామంలో అందరితో సఖ్యతగా ఉండే గోపాల్‌రెడ్డి హత్య ఉదంతం గ్రామస్తులను కలిచి వేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్టు సిఐ కె.గోపాల్‌ రెడ్డి తెలిపారు. ఈ హత్యకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలు.. నాయనబావికి చెందిన రైతు జి.గోపాల్‌ రెడ్డి (40)కి తులసితో వివాహమైంది. ఇద్దరు కుమారులు కాగా పదేళ్ల కిందట తులసి అనారోగ్యంతో మృతి చెందింది. తర్వాత గోపాల్‌ రెడ్డికి బయ్యప్పగారిపల్లి గ్రామం తోకలపల్లికు చెందిన ప్రతిభతో వివాహమైంది. ఈమెకు ఒక కుమార్తె సంతానం. ఈ నేపథ్యంలో ప్రతిభకు నాయనబావి గ్రామం కాయలవారిపల్లి చెందిన దాదం దేవేంద్రరెడ్డి (38)తో వివాహేతర బంధం ఏర్పడింది. ఏడాది క్రితం ఈ విషయం గోపాల్‌ రెడ్డికి తెలిసి నడవడిక మార్చుకోవాలని పలుమార్లు ప్రతిభను హెచ్చరించారు. ఇటీవల టమాటా పంట ద్వారా వచ్చిన డబ్బును ప్రతిభ.. దేవేందర్‌ రెడ్డికి ఇచ్చినట్టు తెలుసుకున్న గోపాల్‌ రెడ్డి మందలించాడు. దీంతో అవమానంగా భావించిన ప్రతిభ అతడి హత్యకు వారం కిందట పొలం వద్ద తన తమ్ముడు బి.రాజశేఖర్‌ రెడ్డి (28), ప్రియుడు దాదం దేవేంద్రరెడ్డితో ఈ విషయం చెప్పింది. గోపాల్‌ రెడ్డి తనను హింసిస్తున్నాడని తెలిపింది. గోపాల్‌రెడ్డి అడ్డు తొలగించుకుంటేనే తను సంతోషంగా ఉంటానని చెప్పింది. దీంతో గోపాల్‌రెడ్డి అడ్డు తొలగించుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రియుడు దేవేంద్రరెడ్డి భావించాడు. వీరు గోపాల్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడ అతడి మొదటి భార్య రెండో కుమారుడు జి.తరుణ్‌ కుమార్‌ రెడ్డి (19)ని కలిశారు. మీ నాన్నను చంపేస్తే ఆస్తిలో సగం భూమి నీ పేరిట రాసి ఇస్తామని ఆశపెట్టి భయపెట్టి ఒప్పించారు. అనంతరం ఈ నెల 20న గుట్టపాలెంలో జరిగిన జాతర ఉత్సవానికి రాజశేఖర్‌ రెడ్డి వచ్చాడు. అక్కడి నుంచి గోపాల్‌ రెడ్డి ఇంటికి వెళ్లి తరుణ్‌కుమార్‌ రెడ్డితో కలిసి పొలం వద్దకు వెళ్లారు. అక్కడ నిద్రిస్తున్న గోపాల్‌ రెడ్డిపై కట్టెతో తలపై కొట్టారు. అతడు పరిగెడుతుండగా తలపై రాయి విసిరి తీవ్రంగా గాయపరిచారు. అప్పటికే అక్కడే ఉన్న దేవేంద్రరెడ్డితో కలిసి చేతులు కట్టేసి కొట్టి తలపై మోది హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా ఆధారాలు సేకరించారు. పలు కోణాల్లో విచారించారు. కేసు ఒక్క రోజులోనే కొలిక్కి వచ్చింది.

ముగ్గురు నిందితులు అరెస్ట్‌

గోపాల్‌ రెడ్డి హత్య కేసులో నలుగురిని నిందితులుగా గుర్తించామని సీఐ గోపాల్‌ రెడ్డి తెలిపారు. గోపాల్‌రెడ్డి రెండో కుమారుడు తరుణ్‌ కుమార్‌ రెడ్డి, బావమరిది రాజశేఖర్‌ రెడ్డి, ప్రతిభ ప్రియుడు దాదం దేవేంద్రరెడ్డిలను మండలంలోని కాండ్లమడుగు క్రాస్‌ వద్ద మంగళవారం ఉదయం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ హత్యకు సూత్రధారి అయిన ప్రతిభను అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు.

వేధిస్తున్నాడనే భర్తను చంపించింది

తమ్ముడు, ప్రియుడితో కలిసి పథకం

ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కర్కశం

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

సూత్రధారి కోసం పోలీసుల గాలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement