కలెక్టర్ నిశాంత్‌కుమార్
సాక్షి, మదనపల్లె: జిల్లాలో ప్రభుత్వశాఖల ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ వసూళ్లను పెంచాలని కోరారు. ఈ ఏడాది రూ.278.15 కోట్ల జీఎస్టీ లక్ష్యం చేరువకావాలన్నారు. మున్సిపల్ శాఖ ట్రేడ్ లైసెన్స్ వివరాలను కమర్షియల్ టాక్స్, ఇంకా జీఎస్టీ పరిధిలోకి రాని వాణిజ్య సంస్థలను గుర్తించాలని కోరారు. జీఎస్టీ బకాయిలు రూ.263 కోట్లు ఉన్నాయని వాటి వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. బ్యాంకర్ల కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి, నిబంధనల మేరకు బ్యాంకు అటాచ్‌మెంట్ చర్యలను చేపట్టాలని సూచించారు. కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమంగా మద్యం రాకుండా నిఘా పెంచాలన్నారు. ఈ ఏడాది గనుల శాఖ ఆదాయ లక్ష్యం రూ.27 కోట్లుగా ఉండగా, ఇప్పటికే రూ.33.62 కోట్లు వసూలైనట్టు తెలిపారు. రవాణా శాఖలో రూ.48.78 కోట్ల ఆదాయం సాధించిందన్నారు. కమర్షియల్ టాక్స్ శాఖతో పాటు మైన్స్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్, రవాణా, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయంతో వసూళ్లను మెరుగుపరచుకోవాలని సూచించారు.


