సాక్షి, మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ నుంచి వేరుపడిన అన్నమయ్య జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటు వ్యవహారం మంగళవారం రాత్రి దాకా కొలిక్కి రాలేదు. మదనపల్లె జిల్లా కేంద్రం కావడంతో కొత్త జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. గురువారంతో జిల్లా ప్రజా పరిషత్ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారి పాలనలోకి వస్తుంది. ఇక మిగిలింది ఒకరోజు మాత్రమే. ప్రభుత్వం కూడా ఈనెల 25 నుంచి జిల్లా ప్రజా పరిషత్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంతవరకు జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోలను నియమించలేదు. ప్రధానంగా సీఈఓ కార్యాలయంలో పనిచేసే ముఖ్య విభాగాల అధికారులు, వాటి కింద విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది నియామకం జరగలేదు. ఈ సిబ్బందిని ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లా పరిషత్ నుంచి అన్నమయ్యకు కేటాయించాల్సి ఉంది. ఇక్కడ పనిచేస్తున్న వారిలో మదనపల్లెకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న వారు ఎంతమంది, ఇంకా ఎంతమందిని నియమించాలి అన్న విషయాలపై స్పష్టత లేదు. దీంతో మిగిలిన ఒకరోజులో సిబ్బందిని సమకూర్చడం, వారు విధుల్లో చేరి విధులు ప్రారంభించడం అనేది కొంత గందరగోళంగా ఉంది.


