అధికారిక కార్యక్రమాలా..
టీడీపీ సభలా?!
● రూ. 94 కోట్ల మున్సిపల్ పనుల శంకుస్థాపనలో ప్రొటోకాల్ తీవ్ర ఉల్లంఘన
● మదనపల్లెలో కలెక్టర్ పక్కనే
ఎమ్మెల్యే కుమారుడు
● పుంగనూరులో టీడీపీ ఇన్‌ఛార్జ్‌కు ‘పెద్దపీట’
● బి.కొత్తకోటలో శంకర్ యాదవ్
‘అన్నీ తానై’ హల్‌చల్
సాక్షి, మదనపల్లె: జిల్లాలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట మంగళవారం నిర్వహించిన ప్రభుత్వ సమావేశాలను పచ్చ చొక్కాల పరంగా మార్చేశారు. కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలు, మరియు బి.కొత్తకోట నగర పంచాయతీలకు సంబంధించి రూ.94 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కుప్పం నుంచే వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దీనికోసం జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి సమావేశాలను నిర్వహించారు. అయితే, ప్రభుత్వ నిధులతో, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో జరగాల్సిన ఈ అధికారిక విధుల్లో ప్రొటోకాల్‌ను పూర్తిగా తుంగలో తొక్కారు.
కలెక్టర్ సాక్షిగా అగ్రతాంబూలం!
మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమ వేదికపై సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆశీనులయ్యారు. అయితే, సభా మర్యాదలను, ప్రభుత్వ నియమాలను పక్కనబెట్టి.. ఎలాంటి అధికారిక హోదా లేని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిని, ఆ పార్టీ కీలక నాయకులను కలెక్టర్‌కు ఇరువైపులా కూర్చోబెట్టడం జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చయాంశంగా మారింది. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ తప్ప మరే ఇతర శాఖల జిల్లా అధికారులు హాజరు కాకపోవడం గమనార్హం. కలెక్టర్ సాక్షిగా అధికారిక హోదా లేకపోయినప్పటికీ, సభలో టీడీపీ నేతలకు అగ్రస్థానం కల్పించడంపై స్వయంగా అధికార వర్గాల్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పుంగనూరులో నేతకు పెద్ద కుర్చీ!
పుంగనూరు మున్సిపల్ అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘనలో మరీ ఒక అడుగు ముందుకు వేశారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదనరెడ్డి స్వయంగా టీడీపీ ఇన్‌ఛార్జ్ మధుసూధన్ నాయుడుకు సాదరంగా ఆహ్వానం పలికి, ముందు వరుసలో తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ చిన్న కుర్చీలో కూర్చోగా, అధికారిక హోదా లేని టీడీపీ నేత మధుసూధన్ నాయుడుకు మాత్రం అధికారులు ప్రత్యేకంగా పెద్దకుర్చీ వేయించి మరీ గౌరవించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. అధికారిక కార్యక్రమంలో టీడీపీ నాయకులకు ఈ స్థాయిలో సాగిలపడిన మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
బి.కొత్తకోటలో శంకర్ యాదవ్ హల్‌చల్..
అటు బి.కొత్తకోట నగర పంచాయతీలోనూ ఇదే పచ్చ రాజకీయం నడిచింది. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ఈ సభకు భారీగా హాజరయ్యారు. ఎలాంటి అధికారిక హోదా లేనప్పటికీ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అన్నీ తానై ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని నడిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక రాయచోటిలో జరిగిన అధికారిక కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు ఏకంగా టీడీపీ నేతలను, కార్యకర్తలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సభకు హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడితో అధికారులు ప్రత్యేకంగా మాట్లాడించడం గమనార్హం. ఈ విధంగా జిల్లాలోని నాలుగు సమావేశాలను మున్సిపల్ అధికారులు పూర్తిగా టీడీపీ పార్టీ కార్యక్రమాలుగా మార్చివేశారు.
అంతా సంఘాల మహిళలే..
సామాన్యులు కరవు!నాలుగు మున్సిపాలిటీల్లో నిర్వహించిన ఈ అధికారిక కార్యక్రమాల్లో, ముఖ్యంగా మదనపల్లె, బి.కొత్తకోట సభల్లో సాధారణ ప్రజలుగానీ, వివిధ శాఖల అధికారులు గానీ ఎక్కడా కనిపించలేదు. సభల నిండా పూర్తిగా మహిళా సంఘాలకు (డ్వాక్రా) చెందిన మహిళలే దర్శనమిచ్చారు. బి.కొత్తకోటలో టీడీపీ శ్రేణులు ఓ మోస్తరుగా కనిపించినప్పటికీ, మదనపల్లెలో మాత్రం సభ అంతా పూర్తిగా మహిళా సంఘాల మహిళలతోనే నిండిపోయింది. ప్రభుత్వ కార్యక్రమానికి జనాన్ని చూపించుకోవడానికి అధికారులు పట్టుబట్టి, ఒత్తిడి తెచ్చి మరీ డ్వాక్రా మహిళలను ఈ కార్యక్రమాలకు రప్పించారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సమీక్షలా లేక టీడీపీ అంతర్గత సభలా అనేలా సాగిన ఈ తీరుపై జిల్లా పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పుంగనూరులో మధూసూదన్‌నాయుడును పెద్దకుర్చీలో కూర్చోబెట్టి చిన్నకుర్చీలో కమీషనర్
మదనపల్లె సభలో కలెక్టర్‌కు ఇరువైపులా
ఎమ్మెల్యే కుమారుడు, టీడీపీ నాయకులు


