విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Sep 23 2026 1:37 AM | Updated on Sep 23 2026 1:37 AM

బి.కొత్తకోట (మదనపల్లె టౌన్‌) : తంబళ్లపల్లె నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బి.కొత్తకోట పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణులు (పంచ వృత్తులు) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విశ్వబ్రాహ్మణులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సంప్రదాయ కుల వృత్తులను కొనసాగిస్తున్న వారికి నేటి అవసరాలకు అనుగుణంగా శిక్షణ, ఆర్థిక సహాయం, ఆధునిక పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో విశ్వబ్రాహ్మణ వృత్తిదారులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో తంబళ్లపల్లె నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు ఎల్లప్ప ఆచారి, పాంచాననం సుపర్ణాచారి, రమేషాచారి, లక్ష్మీనారాయణచారి, సుబ్బాచారి, రెడ్డెప్పాచారి, మంజునాథచారి, మల్లికార్జునచారి, నాగరాజాచారి, ఆనందాచారి, మణికంఠాచారి పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య

బద్వేలు అర్బన్‌ : కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మంగళవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని గాంధీనగర్‌లో షేక్‌రుక్సానా(40) ఆమె భర్త ఖాదర్‌బాషాతో కలిసి నివసిస్తోంది. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు కాగా భర్త డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వారం రోజుల క్రితం భర్త డ్రైవర్‌ డ్యూటీకి వెళ్లగా రుక్సానా ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటోంది.

అయితే కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుండే ఆమెకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఇద్దరు పిల్లలు నిద్రిస్తుండగా మరో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గదిలో తల్లి కనిపించకపోవడంతో మరో గదిలోనికి కిటికీ నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సహకారంతో తలుపులు పగులకొట్టి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్‌ సీఐ బి.రామకృష్ణ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement