మదనపల్లి (కురబలకోట): వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా హంద్రీ నీవా జలాలను సమర్థవంతంగా వినియోగించి ప్రతి చుక్క నీటిని సంరక్షించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి పరిధిలోని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించిన ఆయన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ట్యాంక్‌ను నీటి నిల్వకు సిద్ధం చేయాలన్నారు. వ్యర్థ, పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు తాత్కాలికంగా ట్యాంకు ఎత్తు పెంచి గత ఏడాది కంటే ఎక్కువ నీటిని నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇక్కడికి చేరే హెచ్‌ఎన్‌ఎస్ నీటిని మదనపల్లి మున్సిపాలిటి ప్రజల తాగునీటి ఆవసరాలకు వినియోగించడమే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్ సమావేశ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్లుఎస్, ఇరిగేషన్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులతో వీడియో కాన్పెరెన్సు నిర్వహించారు. జిల్లాలోని 3700 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, పరిసర బోర్‌వెల్స్‌ను వినియోగించుకోవడంతో పాటు జలధార కింద పూర్తయిన 430 పనులను క్షేత్ర స్థాయిలొ మరోసారి పరిశీలించాలన్నారు. రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటరామయ్య,హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ప్రసాద్, డీపీఓ రాధమ్మతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వేకు శ్రీకారం
మదనపల్లె టౌన్: జిల్లాలో కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి అంగవైకల్యాన్ని నివారించాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 11 నుంచి 24వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వేకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ భవన్ లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శరీరంపై స్పర్శ తెలియని మచ్చలు, రంగు మారిన చర్మ భాగాలు లేదా ఇతర అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వాటిని దాచిపెట్టకుండా సర్వే బృందాలకు తెలియజేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక, డీపీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, డీఎన్‌ఎంఓ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు
సత్వరమే పరిష్కరించాలి
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని భారత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ కళ్యాణి, డీఆర్‌ఓ వెంకటేశు పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంత్ కుమార్


