మదనపల్లె టౌన్: మాతాశిశు సంక్షేమ సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వై.శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం త్యాగరాజా వీధిలోని యూపీహెచ్‌సీలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11 నుండి 24 వరకు కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వేను పకడ్బందీగా నిర్వహించి, బాధితులకు ఎండీటీ చికిత్స అందించాలన్నారు. ప్రసవ మరణాలు లేని జిల్లాగా మార్చేందుకు, ప్రతి పీహెచ్‌సీలో నెలకు కనీసం 10 ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు.
10న సైట్ ఇంజినీర్
ధ్రువపత్రాల పరిశీలన
మదనపల్లె సిటీ: సమగ్ర శిక్షలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సైట్ ఇంజినీర్ పోస్టుల అభ్యర్థులకు ఈనెల 10వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ తెలిపారు. గత మే నెలలో నోటిఫికేషన్ ఇవ్వగా 53 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పరిపాలనా కారణాల వల్ల 5 పోస్టులకు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లను డిప్యూటేషన్‌పై కేటాయించామని, మిగిలిన రెండు పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారులు ఆ రోజు ఉదయం 10 గంటలకు సమగ్రశిక్ష కార్యాలయానికి ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
పిటిషన్లకు సత్వర పరిష్కారం
– జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మ
మదనపల్లె సిటీ: సీఎం కార్యాలయ సూపర్ ఆడిట్ టీం ద్వారా గుర్తించిన పిటీషన్లపై జిల్లా స్థాయిలో విచారణ చేపట్టి సత్వర పరిష్కార మార్గాలు చూపుతున్నామని జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మ తెలిపారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని వీడియో కాన్సరెన్సుహాలులో సీఎం కార్యాలయ సూపర్ ఆడిట్ టీం ద్వారా జిల్లాకు పంపిన పిటీషన్లపై సంబంధిత అధికారులు, అర్జీదారులతో స్వయంగా విచారణ నిర్వహించారు. జిల్లా పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, పీజీఆర్‌ఎస్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.


