మదనపల్లె టౌన్‌్ : ఆమెకు సొంత ఇల్లు లేదు.. బంధువులెవరో తెలియదు.. నిత్యం నాలుగు మెతుకుల కోసం చేయి చాచడమే జీవనాధారం. ఎవరైనా దయతలచి పెట్టిన అన్నం తింటూ.. ప్లాస్టిక్ బాటిళ్లు, పాత పేపర్లు, ఇతర గుజరీ సామగ్రిని ఏరుకుంటూ కాలం వెళ్లదీసిన ఓ నిస్సహాయ మహిళ చివరకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మదనపల్లెలో కలకలం రేపింది.మదనపల్లె మండలం బసినికొండ డ్రైవర్స్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. దర్గా సమీపంలోని చెట్టుకు మహిళ వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మహిళ మృతి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై డీఎస్పీ బుచ్చిరాజు స్పందిస్తూ అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టి వాస్తవాను వెల్లడిస్తామని చెప్పారు. మృత దేహానికి కూడా పోలీసులతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.


