సాక్షి, మదనపల్లె: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీకృష్ణ కల్యాణమండపంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోషల్‌మీడియా–దాని ప్రభావం అన్న అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన ఆయన మాట్లాడుతూ సోషల్‌మీడియాను మంచి కోసం వినియోగించాలని, సమాజాన్ని తప్పుదోవ పట్టించే అంశాలు, యువతను నిర్వీర్యం చేసే వాటికి దూరంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్ కలిగిన ప్రతిఒక్కరూ ఎక్కడికక్కడ జరిగే ఘటనలు, విషయాలను పోస్టు చేస్తూ జర్నలిస్టులుగా మారిపోయారని, నిర్దారణ కాని అంశాలను పంపే విషయంలో వాటి వాస్తవికతను ధ్రువీకరించుకోవాలన్నారు. జర్నలిస్టుల సమస్యలైన ఇంటిస్థలాలు, ఆరోగ్య బీమా తదితరవాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి.సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విషయంలో జాప్యం చేస్తోందన్నారు. ఇళ్లస్థలాలు, ఆరోగ్యబీమా, జీవితబీమా అమలు, యూనియన్ పరంగా ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రకటనల విలువలో రెండుశాతం నిధులు జర్నలిస్టుల సంక్షేమానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదన్నారు. యూనియన్‌ను బలోపేతం చేయడం కోసం నాయకులు చొరవ తీసుకుని కృషి చేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండపల్లి అక్కులప్ప, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ సోషల్‌మీడియా ప్రభావం సమాజంలో ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ..అవాస్తవాలను ప్రచారంచేస్తే కలిగే దుష్పరిణామాలను వివరించారు. విద్యార్థులు, యువత సోషల్‌మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదువు, కేరిర్‌పైనే దృష్టి పెట్టాలని, మొబైళ్లకు బానిస అయితే భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. అనంతరం మంత్రి మండిపల్లి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, టీడీపీ నేత మల్లికార్జున నాయుడు, పట్టణ అధ్యక్షుడు అరుణ్‌తేజ్, ఆర్‌జే.వెంకటేష్‌లను ఘనంగా సత్కరించారు. అనంతరం యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జర్నలిస్టు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలకు సిద్దమవుతామని అధ్యక్షుడు సుబ్బారావు పేర్కొన్నారు. యూనియన్ బలోపేతంపై చర్చించి మార్గనిర్దేశం చేశారు. సమావేశంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు పి.ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వంశీధర్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు టి.షామీర్‌బాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస గౌడ, జర్నలిస్టు సంఘ ప్రతినిధులు శ్రీనివాసులు, శివ, శివారెడ్డి, గోపి, కోదండరామిరెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.
ఏపీయూడబ్ల్యూజే సెమినార్‌లో
మంత్రి మండిపల్లి
పరిష్కరించకుంటే ఆందోళన చేస్తాం: సుబ్బారావు


