● ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల తగ్గుదల
● ప్రైవేట్‌లోనూ ఇదే పరిస్థితి
● అంతుచిక్కని కారణాలు
సాక్షి, మదనపల్లె : సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంటుంది. మొదటి తరగతి విద్యార్థులు వారు చదివే పాఠశాలలో అక్కడ ఉన్న తరగతి వరకు కొనసాగించడం జరుగుతుంది. లేదంటే మధ్యలో పాఠశాలలు మారడం లేదా ఇతరా ప్రాంతాలకు వెళ్లడం సాధారణం. అయితే దీనికి భిన్నంగా గత విద్యా సంవత్సరం విద్యార్థులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చూస్తే భారీగా తగ్గుదల కనిపిస్తోంది. దీనికి కారణాలేమిటో అంతుచిక్కడం లేదు. జిల్లాలో ఈ విద్యాసంవత్సరంలో 5,577 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తగ్గారు.
ప్రభుత్వ బడుల్లో 4,097 మంది తగ్గారు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 –26 ఏడాదికంటే 2026–27 ఏడాదిలో 4,097 మంది విద్యార్థులు తగ్గిపోయారు. జిల్లాలో ఎయిడెడ్ విభాగంలో రెండు హైస్కూళ్లు, రెండు ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలో 279 హైస్కూళ్లు, 147 ప్రాథమిక పాఠశాలలు, 29 ప్రాథమికోన్నత పాఠశాలలో కలుపుకొని మొత్తం 1,785 స్కూళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో గత విద్యా సంవత్సరంలో 1,07730 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుత ఏడాదికి పరిశీలిస్తే 1,06,653 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ అంకెలు పరిశీలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4,097 మంది విద్యార్థులు తగ్గిపోయారు.
ప్రైవేట్‌పై మోజు తగ్గిందా..
సాధారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి. అయితే ఇక్కడ కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. జిల్లాలో 196 హైస్కూళ్లు, 121 ప్రాథమిక పాఠశాలలు, 115 ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రైవేటు యాజమాన్యాల కింద నడుస్తున్నాయి. వీటిలో గత ఏడాది 89,582 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఏడాదిలో 88,102 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే ఈ ఏడాది 1,480 విద్యార్థుల సంఖ్య తగ్గింది.
తగ్గడానికి కారణాలు ఏమిటి?
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోయిందో కారణాలు తెలియడం లేదు. విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మీరంతా కుటుంబంతో కలిసి వలసలు వెళ్లారా లేక మధ్యలోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నారా అన్న లెక్కలు లేవు. డ్రాపౌట్స్ అయితే వారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. అయితే ఒక తరగతి నుంచి మరో తరగతికి వెళ్లాల్సిన విద్యార్థులు.. కొన్ని తరగతుల్లో ఉన్న సంఖ్య కంటే పెరుగుదల కనిపిస్తుంది. ప్రధానంగా 5, 6, 7 తరగతుల్లోనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం విద్యాశాఖ గణాంకాలే స్పష్టంగా చెబుతున్నాయి. బి.కొత్తకోట, ములకలచెరువు, తంబళ్లపల్లె, మదనపల్లె, రామసముద్రం, కురబలకోట మండలాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడి కుటుంబాలకు కర్ణాటకకు వలసలు వెళ్లాయని అనుకున్నా వేలసంఖ్య వెళ్లిన దాఖలాలు లేవు. పదులసంఖ్యలో వెళ్లే పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. 5,577 మంది విద్యార్థులు తగ్గేస్థాయిలో ఈ పరిస్థితి లేదు.
అధ్యయనం అవసరం
జిల్లాలో పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంపై తక్షణమే అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత తగ్గే ప్రమాదం లేకపోలేదన్నది అన్నది అర్థమవుతోంది. పాఠశాల వారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్యను గుర్తించి, ఆ విద్యార్థుల స్థితిగతులను తెలుసుకొని కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వేల సంఖ్యల విద్యార్థులు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది.


