మదనపల్లె సిటీ : మానవ మహోపకారి ప్రవక్త హజరత్ మహమ్మద్ అని పలువురు ముస్లిం ఉలేమాలు పేర్కొన్నారు. ఇస్లాం చివరి ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లెలో బుధవారం ముస్లిం సోదరులు మీలాద్–ఉన్–నబీని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
పట్టణ పురవీధుల్లో సామూహిక ర్యాలీ నిర్వహించారు. మహాప్రవక్త హజరత్ మహ్మద్ మానవ మహోపకారి అని, ఆయన సూచించిన మార్గంలో నడిచి ఆదర్శవంత సమాజ నిర్మాణం నిర్మించాలని పిలుపునిచ్చారు. మీలాద్–ఉన్–నబీ సందర్భంగా మసీదులు, దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. స్థానిక బడేమకాన్‌లో దర్గా ముతవల్లి మకాన్‌దార్ సయ్యద్ హాషిం ఆధ్వర్యంలో గత 12 రోజులుగా పుస్తకపఠనం చేపట్టి బుధవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాతెహా కార్యక్రమం నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. మీలాద్–ఉన్–నబీ వేడుకలలో భాగంగా మసీదులు, దర్గాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
పెద్దమండ్యం మండలంలో..
పెద్దమండ్యం : మండలంలోని ఎన్‌వోపల్లె పంచాయతీ కలిచెర్ల పాతూరులో మిలాద్ –ఉన్– నబి వేడుకలు బుధవారం జరిగాయి. ఈ సందర్బంగా పాతూరు కూడలి వద్ద జెండాను ఆవిష్కరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి గంధం, ఫాతేహా జరిపి ప్రసాదాలను పంచి పెట్టారు. పెద్దమండ్యం పాతూరు జెండామాను వద్ద, విద్యానగర్ కాలనీ, పాపేపల్లె, తురకపల్లె గ్రామాల్లో మిలాద్ –ఉన్– నబి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా మైనార్టి సంఘం నాయకులు పెద్దమండ్యంలో అన్నదానం చేశారు.
పెద్దతిప్పసముద్రం మండలంలో..
పెద్దతిప్పసముద్రం : మండలంలోని ముస్లిం సోదరులు బుధవారం మిలాద్–ఉన్ నబిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేపట్టిన అనంతరం మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. ప్రేమాభిమానాల వనంలో వికసించినదే ఇస్లాం అని వక్తలు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను భక్తిగా పఠించి వాటి ఉపదేశాలను వివరించారు.


