●నియోజకవర్గాల్లో పచ్చ నేతల టిక్కుల పర్వం | - | Sakshi
Sakshi News home page

●నియోజకవర్గాల్లో పచ్చ నేతల టిక్కుల పర్వం

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

●నియోజకవర్గాల్లో పచ్చ నేతల టిక్కుల పర్వం

సాక్షి ప్రతినిధి, కడప: ఉమ్మడి వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలో ప్రకృతి సంపద దోపిడీ పతాక స్థాయికి చేరింది. ఇసుక, గ్రావెల్‌, బరైటీస్‌ వంటి అపురూప ఖనిజాలను అధికార పార్టీకి చెందిన ‘తెలుగు తమ్ముళ్లు’ నిలువునా కొల్లగొడుతున్నారు. ఖనిజాల తవ్వకాలకు లీజు అనుమతులు, రాయల్టీ పర్మిట్లు తప్పనిసరి అయినప్పటికీ.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్యేల సిఫార్సులుంటే చాలు, ఎక్కడైనా యథేచ్ఛగా తవ్వకాలు జరపవచ్చనేది ఇక్కడ అమలవుతున్న ఏకై క నిబంధన. పాతకాలంలో సామంత రాజులు కప్పం చెల్లించినట్లుగా అక్రమార్కులు తెలుగుతమ్ముళ్లకు మామూళ్లు ముట్టజెబుతుండటంతో.. అటువైపు మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు. ఈ వ్యవస్థీకృత దోపిడీ వల్ల నెలకు ఏకంగా రూ.100 కోట్ల ప్రజా సంపద అక్రమార్కుల పాలవుతున్నా, నిఘా విభాగాలు సైతం కళ్లున్న కబోదిలా మిన్నకుంటున్నాయి.

కళ్లముందే ‘బరైటీస్‌’ లూటీ.. లీజుదారుల ఆవేదన

ముఖ్యంగా వేంపల్లె, వేముల, పులివెందుల ప్రాంతాలలో కళ్లముందే అపురూపమైన బరైటీస్‌ (ముగ్గురాయి) ఖనిజ తవ్వకాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. అసలైన లీజు హోల్డర్లతో ఏమాత్రం నిమిత్తం లేకుండా తెలుగుతమ్ముళ్లు అడ్డగోలుగా మైనింగ్‌ సాగిస్తున్నారు. దీనిపై లీజుదారులు ఎన్నో పర్యాయాలు మైనింగ్‌, పోలీస్‌, రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల రాయల్టీ ఆదాయం నిలువునా గంగపాలవుతోంది. అధికారులు, నిఘా సంస్థలైన విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగాలు సైతం అంతా చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారినట్లు స్పష్టమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎమ్మెల్యే ‘ఏటీఎంగా’ పాపాఘ్ని నది

జిల్లాలోని ప్రముఖ జీవనది పాపాఘ్ని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు పక్కా ‘ఏటీఎం’గా మారిపోయింది. ఎనీటైం, ఎనీ సెంటర్‌లో ఇసుక తీసుకెళ్లేందుకు వీలుగా నెలకు ఏకంగా రూ.1.30 కోట్లు చెల్లించేలా ఇసుక విక్రయాలలో మునుపు అనుభవమున్న ఒక వ్యక్తితో సదరు ఎమ్మెల్యే అంతర్గత ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సదరు కాంట్రాక్టరుకు చెందిన వాహనాలు మినహా మరెవ్వరి వాహనాలు పాపాఘ్ని నదిలోకి దిగినా, వెంటనే అధికారులు రంగంలోకి దిగి ప్రత్యక్ష చర్యలు తీసుకుంటున్నారు. అయితే గడిచిన నెలలో ఆశించిన తీరులో విక్రయాలు లేనందున, ఈ కప్పం మొత్తాన్ని రూ.1.15 కోట్లకు తగ్గించుకోవాలని సదరు కాంట్రాక్టరు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నట్లు సమాచారం.

చెయ్యేరు, బహుదా నదుల చెర.. బెంగళూరుకు క్యూ

మరోవైపు అన్నమయ్య జిల్లాలోని చెయ్యేరు, బహుదా నదులను కూడా తెలుగుతమ్ముళ్లు పూర్తిగా చెరబట్టారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పరపతిని అడ్డం పెట్టుకుని ఈ నదులపై గుత్తాధిపత్యం సాధించారు. ఇక్కడి నుండి రేయింబవళ్లు పదుల సంఖ్యలో భారీ లారీలు క్యూ కట్టి మరీ ఇసుకను నేరుగా బెంగళూరుకు తరలిస్తున్నా, ఎక్కడా అడ్డగించే సాహసం కూడా అధికారులు చేయలేకపోతున్నారు. ఈ మాఫియా నియమించుకున్న లారీలు తప్ప మరెవ్వరి లారీలు వచ్చి చేరినా, ట్రాన్స్‌పోర్టు అధికారులు వెంటనే దూకుడు ప్రదర్శిస్తూ జరిమానాలు విధిస్తున్నారు.

పాపాఘ్ని నది నుంచి అక్రమంగా తరలివెళ్తోన్న ఇసుక

హైలెవల్‌ బ్రిడ్జి ప్రక్కనే భారీ యంత్రాలతో టిప్పర్లు ద్వారా తరలిస్తున్న ఇసుక

ప్రకృతి సంపదను దోచుకుంటున్న

తెలుగుతమ్ముళ్లు

వేంపల్లె, వేముల, పులివెందులలో ‘బరైటీస్‌’ లూటీ

పాపాఘ్ని నది ఓ ఎమ్మెల్యేకు ‘ఏటీఎం’.

నెలకు రూ.1.30 కోట్ల ఒప్పందంతోనే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

చెయ్యేరు, బహుదా నదులను చెరబట్టిన ‘పచ్చ’ నేతలు

నేరుగా బెంగళూరుకు భారీ లారీల క్యూ

జమ్మలమడుగు రూరల్‌, కొండాపురం ప్రాంతాలలో మరో ఎమ్మెల్యే సమీప బంధువులు ఇసుక ద్వారా అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. లింగాల, వేంపల్లె, చక్రాయపేట మండలాలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇసుక రీచ్‌ల వద్ద తెలుగుతమ్ముళ్లు ‘టిక్‌’ కొట్టిన వ్యక్తి మాత్రమే ఇసుక తీసుకెళ్లాలనే అలిఖిత చట్టం నడుస్తోంది. నిజానికి ఖనిజ సంపద రక్షణకై జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీఓ, మైనింగ్‌ ఏడీ సమన్వయంతో అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి. కానీ నేడు పాలకులు, అధికారులు చూపిస్తున్న ఘోర నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే.. భవిష్యత్‌ తరాలకు బరైటీస్‌ ఖనిజం ఇలా ఉండేదని, ఇసుక ఈ స్థాయిలో దొరికేదని, గ్రావెల్‌ అంటే ఇదంటూ కేవలం పుస్తకాల్లో బొమ్మలు చూపించి చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందని పర్యావరణ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement