● ఏడేళ్ల క్రితం బరువుతూచే (వేయింగ్) యంత్రాలు ఏర్పాటు
● ఒక్కరోజూ వినియోగం లేక
తుక్కు కింద అమ్మేశారు..
● రూ.5.35 లక్షలకు పాట
సాక్షి, మదనపల్లె: అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా రూ.20 లక్షల విలువ కలిగిన బరువుతూచే యంత్రాలను తుక్కు కింద అమ్మేశారు. ఏడేళ్ల క్రితం మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఈ వేయింగ్ మిషన్లు ఒక్కరోజు కూడా వినియోగించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మార్కెట్లో అడ్డుగా ఉన్నాయని వేలం వేసి అమ్మేశారు. మార్కెటింగ్ శాఖ అధికారుల సమాచారం మేరకు...
మదనపల్లెలో ఏడేళ్ల క్రితం మార్కెట్ ముఖద్వారంలో ఇరువైపులా రెండు వేయింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. దీనికోసం రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. టమాటా బాక్సులు నింపుకున్న లారీలు ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు వాటి బరువు ఎంతుందో తూకం వేసుకుని ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. వీటిని ఏర్పాటు చేసిన రోజు నుంచి తుక్కు కింద వేలంపాట నిర్వహించే వరకు ఒక్కరోజు కూడా దీన్ని వినియోగించుకుంది లేదు. ఎందుకంటే టమాటా కేట్ల సంఖ్యను బట్టి ఎన్ని టన్నుల టమాటా ఉందో లెక్క వస్తుంది. అనాలోచిత నిర్ణయంతో దీన్ని ఏర్పాటు చేయగా ఈ రెండు వేయింగ్ మిషన్లు నిరుపయోగంగానే ఉన్నాయి. దీనికి తోడు వీటిని వాహనాలు లోపలికి, బయటకు వెళ్లే ముఖద్వారం వద్దే ఏర్పాటు చేయడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో వీటిని వదిలించుకునేందుకు అధికారులు నిర్ణయించుకుని వేలం పాటలు వేశారు. మొదటిసారి వారం క్రితం వేసిన వేలంపాటకు ఇద్దరు మాత్రమే హాజరై అతి తక్కువ ధరకు పాడగా దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. తిరిగి మంగళవారం వేలంపాట నిర్వహించగా ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. వారు రూ.20 లక్షలు పైబడిన ఈ రెండింటికి రూ.5.35 లక్షలకు పాట పాడడంతో అధికారులు దాన్నే ఖరారు చేశారు. అంటే మార్కెటింగ్ శాఖ ఎన్ని లక్షలు నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇద్దరు పాటదారులే హాజరు కావడం, వారి పాటనే ఖరారు చేయడం వెనుక మతలబు దాగుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


