● పెద్ద చెరువును నిలువునా మింగేస్తున్న దురాక్రమణదారులు
● చుట్టూ కంచెలు వేసి పంటల సాగు
● ఎల్‌నినో దెబ్బకు పచ్చగడ్డి కరువు
● ఉన్న చెరువు భూములను
కొల్లగొట్టడంతో పాడి రైతుల కన్నీరు
● నిమ్మకు నీరెత్తినట్లున్న
రెవెన్యూ, ఇరిగేషన్ యంత్రాంగం
రామసముద్రం మండలం ఉప్పినెల్లి చెరువులో
పైపులు వేసి కొత్తిమీర సాగు చేసిన దూరాక్రమణదారులు
చెరువును ఆక్రమించి కంచె వేసిన దృశ్యం
చెరువును ఆక్రమించి బంతి సాగు చేసిన రైతు
రామసముద్రం: మండలంలోని మాలేనత్తం పంచాయతీ పరిధిలో ఉన్న చరిత్రాత్మక ఉప్పినెల్లి చెరువు ప్రస్తుతం భూబకాసురుల ఆకలికి నిలువునా బలైపోతోంది. సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ పెద్ద జలాశయాన్ని కొందరు స్వార్థపరులు యథేచ్ఛగా ఆక్రమించి ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంగా మార్చేస్తున్నారు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పచ్చగడ్డి కరవై పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి గడ్డు కాలంలో జీవనోపాధికి పెద్ద దిక్కుగా ఉన్న చెరువు పరిసరాల భూములను కూడా కబ్జా చేసి తోటలు పెంచడంతో.. పశువులు, మేకలు, గొర్రెలను మేపుకోవడానికి కనీస స్థలం లేక పాడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణదారులు ఏకంగా జేసీబీ యంత్రాలను రంగంలోకి దించి చెరువు గర్భాన్ని ఇష్టానుసారంగా దున్ని, భూములను చదును చేశారు. అక్కడ టమాట, కొత్తిమీర, మొక్కజొన్న, క్యాలీఫ్లవర్ తోటలను విస్తారంగా సాగు చేయడమే కాకుండా చుట్టూ పక్కాగా కంచెలు ఏర్పాటు చేసుకున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా చెరువు భూముల్లోనే భారీ పైపులైన్లు వేసి, నీటిని అక్రమంగా తోడేస్తూ పంటలకు వాడుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో చెరువు నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బహిరంగ దోపిడీపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు క్షేత్రస్థాయిలో స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ.. వారు నిమ్మకు నీరెత్తినట్లు, చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉప్పినెల్లి చెరువు భూములను పక్కాగా సర్వే చేయించి, అక్రమ పైపులు, కంచెలను తొలగించి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని రైతులు కోరుతున్నారు.


