● గుండెలవిసేలా రోదించిన అమ్మ
● ప్రాణం తీసిన ఈత సరదా
కురబలకోట : మదనపల్లి సమీపంలోని వినాయక చేనేతనగర్‌లో తల్లి చూస్తుండగానే కొడుకు మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పట్టణంలోని అనపగుట్టకు చెందిన మంజునాథ్(18) పదవ తరగతి చదువుతున్నాడు. శనివారం తల్లి వసంతతో కలసి దుస్తులు ఉతకడానికి సమీపంలోని వినాయక చేనేతనగర్ దగ్గరున్న చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ తల్లి దుస్తులు ఉతుకుతుండగా మంజునాథ్ సరదాగా ఈత ఆడటానికి నీళ్లలోకి దిగాడు. ఒక్కసారిగా చెరువులో మునిగిపోయాడు. కళ్లముందే కుమారుడు నీటిలో మునిగిపోవడంతో ఆ తల్లి ఎంతగానో తల్లడిల్లిపోయింది. ఆమె వేదన బాధతో చూపరుల కళ్లు చెమ్మగిల్లాయి. స్థానికులు వెంటనే తాళ్ల సాయంతో అతన్ని బయటకు తీశారు. అప్పటికే చనిపోవడంతో ఆ తల్లి రోదన చెప్పనలవి కాకుండా పోయింది. మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


