సాక్షి, మదనపల్లె: స్వాతంత్య్ర ఫలాలు ప్రతి నిరుపేదకు చేరేలా ప్రతి ఉద్యోగి తన విధి నిర్వహణలో అంకితభావంతో సేవ చేద్దామని ఇన్‌చార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. శనివారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదని, ప్రతి పౌరుడు సమానంగా గౌరవం, న్యాయం పొందే సమాజ నిర్మాణమే నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తి అని పేర్కొన్నారు. అధికారులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా పనిచేయాలన్నారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్, డీఆర్‌ఓ వెంకటేశుతో కలిసి మొక్కలు నాటారు. కేఆర్‌ఆర్సీ ఎస్‌డీసీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
మదనపల్లె టౌన్: మదనపల్లె లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో పోలీసులు అంకిత భావం, నిజాయితీతో ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, ఎస్బీ సీఐలు యు.సదాశివయ్య, ఎస్.ఏరీషావలి, ఆర్.ఐ కె.సురేష్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


