జీవనోపాధికి వెళ్లిన అర్హులైన ఓటర్లను తొలగించొద్దు | - | Sakshi
Sakshi News home page

జీవనోపాధికి వెళ్లిన అర్హులైన ఓటర్లను తొలగించొద్దు

Aug 16 2026 5:03 AM | Updated on Aug 16 2026 5:03 AM

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

రాయచోటి అర్బన్‌ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో రాయచోటి నియోజకవర్గానికి చెందిన 20 వేల మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలు వివరించారు. నోటీసులు అందిన వారిలో చాలా మంది చదువులు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారే ఉన్నారని, ముఖ్యంగా కుటుంబ పోషణకు గల్ప్‌ దేశాలకు వెళ్లిన అర్హులైన ఓటర్లను , బయట ప్రాంతాల్లో ఉన్న వారు స్థానికంగా అందుబాటులో లేరనే కారణంతో ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో స్థానికంగా ఓటరు అందుబాటులో లేకపోయినా వారి తల్లితండ్రులు , సమీప కుటుంబ సభ్యులు డిక్టరేషన్‌ సమర్పిస్తే సరిపోతుందని చెప్పిన అధికారులు , ఇప్పుడు విదేశాల్లో ఉన్న వారు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. విదేశాల్లో ఉన్నవారు తక్షణమే స్వదేశానికి బయలుదేరి రావడం ఆర్థికంగా , ఆచరణాత్మకంగా కష్టంతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న ఓటర్లను వీడియో కాల్‌ ద్వారా సంప్రదించి, వారు అందించే వివరాలు, సమర్పించే ద్రువపత్రాలను పరిశీలించి ఎన్నికల అధికారులు సంతృప్తి చెందేలా ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించాలని శ్రీకాంత్‌ రెడ్డి సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా ఎన్నికల సంఘం తగిన నిర్ణయాలు తీసుకుని వారి ఓటు హక్కును సంరక్షించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. అర్హులైన ఓటర్ల విషయంలో ఇలాంటి అయోమయ పరిస్థితులు లేకుండా ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ తరపున ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement