రాయచోటిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సాక్షి, అన్నమయ్య: దగా డీఎస్సీపై ప్రజా పోరు నింగినంటింది. పోలీసులను అడ్డు పెట్టి వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని కట్టడి చేయాలని చూసి కూటమి ప్రభుత్వ ప్రయత్నం విఫలమైంది. ఖాకీల ఆంక్షల సంకెళ్లు యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణుల ర్యాలీల ముందు నిలవలేకపోయాయి. పట్టణ.. పురవీధులన్నీ వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పోటెత్తాయి. డీఎస్సీలో అక్రమాలు వెలికితీయాలని చిత్తశుద్ధితో కొనసాగిస్తున్న ఉద్యమాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు విజయవంతంగా నిర్వహించాయి. పులివెందులలో లాఠీఛార్జి చేసినా ర్యాలీ ముందుకు సాగించారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టడి చేసిన కార్యకర్తలు ఇసుమంత కూడా వెనక్కి తగ్గలేదు. పైగా మరింత దూకుడుగా నిరశన కొనసాగించారు.
● జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సోమవారం చేపట్టిన నిరసన ర్యాలీ విజయవంతమైంది. డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి అయినవారికి కట్టబెట్టారనే ఆరోపణలకు భారీ ఎత్తున ప్రజా మద్దతు లభించింది. అక్రమాలకు తెరలేపిన మంత్రి నారాలోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి.
సాక్షి అన్నమయ్య : రాష్ట్రంలో డీఎస్సీకి సంబంధించిన జరిగిన పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైస్సార్ సీపీ శ్రేణులు, నిరసన కారులు రోడ్డెక్కారు. అంతేకాకుండా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు గర్జించాయి. ఎక్కడికక్కడ కొన్నిరోజులుగా రిలే దీక్షలతోపాటు ఆందోళనలతో కదం తొక్కుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం చేసిన అవకతవకలపై ప్రత్యేక విచారణ కోరుతూ ఉద్యమబాట పట్టారు. అందులో భాగంగా సోమవారం నిరసన ర్యాలీలతో హోరెత్తించారు. అడుగడుగునా పోలీసులు ఆంక్షలు పెట్టినా వెనుకడుగు లేకుండా అడుగులుముందుకేస్తూ ర్యాలీలను విజయవంతం చేశారు. అన్నమయ్య జిల్లాలోనిఅన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సాగిన ఉద్యమ హోరు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.
పీలేరులో చింతల....మదనపల్లెలో నిసార్...
పీలేరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రత్యేకంగా నియోజకర్గంలోని కేవీ పల్లెలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. జెండాలు చేతబూని నినాదాలతో హోరెత్తించాయి. పెద్ద ఎత్తున యువత, నిరుద్యోగులు కూడా సంఘీభావం వ్యక్తం చేశారు. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో నిరసన ర్యాలీ ఉవ్వెత్తిన ఎగిసిపడింది. మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు గర్జించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలతో మదనపల్లె పట్టణం హోరెత్తింది. ర్యాలీ టీటీడీ కల్యాణ మండపం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రధాన రోడ్లపై సాగిన ర్యాలీకి అపూర్వ ఆదరణ లభించింది
గర్జించిన పుంగనూరు
జిల్లాలోని పుంగనూరులో వైఎస్సార్‌సీపీ నేతలు,కార్యకర్తలు, శ్రేణులతో నిరసన హోరెత్తింది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కదిలిన శ్రేణులు కదం తొక్కుతూ అడుగులు వేశారు. ఎక్కడ చూసినా జనమే జనం కనిపించారు. బస్టాండులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభమై ర్యాలీ అంబేడ్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. పార్టీకి సంబంధించి ప్రధాన నాయకులతోపాటు కార్యకర్తలు, శ్రేణులు నిరసన ర్యాలీలో కొనసాగారు.
తంబళ్లపల్లెలోనూ నిరసన హోరు
నియోజకవర్గ కేంద్రమైన తంబళ్లపల్లెలో వైఎస్సార్‌సీపీ ర్యాలీ విజయవంతంగా కొనసాగింది. పట్టణంలోని వైఎస్సార్‌సర్కిల్ నుంచి రాగిమానుసర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలో నినాదాలు చేశారు. అన్నిమండలాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి విజయంతం చేశారు. అందరూ సమిష్టిగా ముందుకు వచ్చి కార్యక్రమం నిర్వహించడం విశేషం.
పోలీసుల ఆంక్షలపై..
జిల్లాలోని రాయచోటిలో ర్యాలీకి పోలీసులు ఆంక్షలు పెట్టడంపై శ్రేణులు రగిలిపోయారు. అతి తక్కువ మందితో ర్యాలీ నిర్వహించుకోవాలంటూ పోలీసులు ఇచ్చిన ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నేత లు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతోపాటు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని కోరారు.


