● రెచ్చిపోతున్న దొంగలు
● కొరవడిన నిఘా
గుర్రంకొండ: పాపభీతి లేదు.. దైవద్రోహానికి వెనుకాడటం లేదు.. దేవుడి సొమ్ముకే కన్నం వేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల హృదయాల్లో కొలువైన దైవసన్నిధిలో ఇప్పుడు భయం నీడలు అలుముకున్నాయి. తాళాలు పగలగొట్టడం, హుండీలు గుల్ల చేస్తున్నారు.దొంగల ముఠాలు రాత్రి వేళల్లో ఆలయాలను టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా గుర్రంకొండ దళితవాడలోని శ్రీ పోలేరమ్మతల్లి ఆలయంలో ముగ్గురు దుండగులు అమ్మవారి త్రిశూలాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల స్థానిక కొత్తపేట వీధీకి వెనుకవైపు చాపలబండ పరిసరాల్లొని శ్రీ బోయకొండ గంగమ్మతల్లి ఆలయంలోనూ అమ్మవారి త్రిశూలాన్ని ధ్వంసం చేశారు. ఇదే పరిసరాల్లోని ముచ్చుకోన గుట్ట దగ్గర పురాతన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించి స్వామివారి గంట, ఇతర వస్తువులను చోరీ చేసుకెళ్లారు. ఎల్లుట్ల కొండల్లోన పురాతన ఆలయంల్లోనూ స్వామివారి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. మండలంలోని సంతాన దేవత శ్రీ చెర్లోపల్లె శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలోనూ దుండగులు ఆలయహుండీని పగులగొట్టి చోరికి పాల్పడ్డారు. వీటితో పాటు ఆరు దేవాలయాల్లో దుండుగులు విధ్వంసం సృష్టించి చోరీలకు పాల్పడ్డారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు
కొంతమంది దుండగులు గుప్తనిధులు ఉంటాయనే నమ్మకంతో మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాలు, అందులోనూ పురాతన ఆలయాలను లక్ష్యంగా ఎంచుకొంటున్నారు. గుర్రంకొండకు పరిసరాల్లో ఇండియన్ డాబా వెనుక భాగంలో గుట్టల నడుమ పురాతన శ్రీ ఆంజినేయస్వామి ఆలయం ఉంది. ఇక్కడ గుప్త నిధులు దాగి ఉంటాయని భావించి కొంతమంది స్థానికుల సహకారంతో దుండగులు రాత్రికిరాత్రే జేసీబీలతో తవ్వకాలు జరిపారు. ఎల్లుట్ల గ్రామానికి సమీపంలోని కొండలో ఉన్న పురాతన ఆలయంలోనూ తవ్వకాలు చేపట్టారు. మండలంలోని చెర్లోపల్లె శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయ పరిసరాల్లోనూ గతంలో క్షద్రపూజలు నిర్వహించిన దుండగులు తవ్వకాలు జరిపారు. సంగసముద్రం పరిసరాల్లోని మహేంద్ర మర్రి ఆశ్రమ పరిసరాల్లోనూ పురాతన స్థలాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారు. కొంతమంది గుప్తనిధుల కోసం, మరికొంతమంది క్షుద్రపూజలకోసం మరికొంతమంది తమ పైశాచిక ఆనంద కోసం ఆలయాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో శ్రీ మంజునాథస్వామి ఆలయంలో దుండుగులు స్వామి వారి విగ్రహాలను ధ్వంసం చేసి మలమూత్రాలతో అపవిత్రం చేసి పైశాచిక ఆనందం పొందారు. గతనెల రోజులుగా గుర్రంకొండ పరిసరాల్లో దుండగులు త్రిశూలాలు పెకలించడం, గంటలు పగులగొట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు. కాగా కొంతమంది డబ్బుకు ఆశపడి హుండీలు పగుల గొట్టడం, విలువైన వస్తువులు చోరీ చేసుకొని వెళుతున్నారు.
కొరవడిన పోలీసుల నిఘా
మండలంలో పురాతన ఆలయాల్లో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నా పోలీసుల నిఘా మాత్రం కొరవడిందని ప్రజలు చర్చించుకొంటున్నారు. సంఘటనలు జరినప్పుడు కేవలం కేసులతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. ఆలయాల్లో ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు, వారి ఉద్దేశమేమిటి, దుండగుల కదలికలపై నిఘా ఉంచితే వాస్తవాలు వెలుగుచుస్తాయని, పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


