కురబలకోట: అంగళ్లులో మూడేళ్ల చిన్నారి ఏడుపు..చుట్టూ చేరిన జనం. ఈ పాప ఎవరో ఏమిటో ఎవరైనా వదిలేసి వెళ్లారా.. ఏ తల్లి బిడ్డో తెలియక ఉత్కంఠతకు గురయ్యారు. ఈ సంఘటన మండలంలోని అంగళ్లులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గంట పాటు ఈ చిన్నారి ఎవరంటూ స్థానికులు పోలీసులు హైరానా పడ్డారు. చివరకు విషయం తెలిసిరావడంతో ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల కథనం మేరకు.హిందూపురానికి చెందిన కుటుంబం మండలంలోని అంగళ్లులోని బంధువుల ఇంటికి వచ్చారు.. వీరి చిన్నారి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంట్లోవాళ్లు వంటావార్పులో ఉన్న సమయంలో ఇంటి దగ్గర ఉన్న జామ చెట్టు వద్ద తోటి పిల్లలతో ఉంటూ కొంత దూరం అనుకోకుండా వెళ్లిపోయింది. తర్వాత ఇంటిని గుర్తుపట్టలేక ఏడ్వడం ప్రారంభించింది. చిన్న వయస్సు ఆపై ఇంకా మాటలు రాకపోవడంతో స్థానికంగా ఉన్న వారు గమనించి చేరదీశారు. తర్వాత చిన్నారిని అంగళ్లు మసీదు వద్దకు తీసుకెళ్లి ఆరా తీశారు. అక్కడ చిన్నారిని ఎవ్వరూ గుర్తుపట్టక పోవడంతో స్థానికంగా ఉన్న ఔట్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టసాగారు. ఇదిలా ఉండగా పాప కన్పించకపోవడంతో పోలీసుల సాయం కోసం తల్లిదండ్రులు కూడా వారికి ఎదురయ్యారు. పోలీసుల వద్ద ఉన్న పాపే మాపాప అని గుర్తించారు. ఎస్‌ఐ మధు రామచంద్రుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ సుధాకర్ సమక్షంలో ఆ చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత వరకు నెలకొన్న హడావుడి టెన్షన్ ఒక్కసారిగా వీడిపోయింది.


