● వార్డులో చేర్చుకునేందుకు ఆలస్యం చేశారని కుమారుడి ఆవేదన
● మృత్యువుతో పోరాడి మరణించిందని కుటుంబ సభ్యుల రోదనలు
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లా కడప నగర శివారులలో జిజిహెచ్ (రిమ్స్)లో రెండు రోజుల క్రితం ఆయాసంతో చేరిన సుజనమ్మ (55) వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామానికి చెందిన సుజనమ్మ, తన కుమారుడు శేషయ్య, కుటుంబ సభ్యుల సహాయంతో శుక్రవారం కడప రిమ్స్‌లో క్యాజువాలిటీలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను అదే రోజు రాత్రి మెడికల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. అక్కడ వార్డులో అడ్మిట్ చేసుకునేందుకు స్టాఫ్ నర్స్ లేదని, వైద్య సిబ్బంది చేర్చుకోకపోవడంతో దాదాపు గంటన్నర పాటు కుటుంబ సభ్యులతో పాటు అక్కడే సుజనమ్మ వేచి ఉన్నారు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ వచ్చి ఆమె పరిస్థితి బాగాలేదు చావు బతుకుల మధ్య ఉందని, తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు. ఆమె బ్రతికున్నప్పుడే ఎక్కడికై నా తీసుకెళ్లండి అని చెబితే తాము దూరప్రాంతాలకు మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లే వారమని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే తాము తల్లిని పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా చూడాలని పోలీసులు ఇలాంటి సంఘటనలపై దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చనిపోయిన 24 గంటల తర్వాత ఆదివారం ఉదయం వరకు పోలీసుల చుట్టూ తిరిగి తిరిగి అంత్యక్రియల కోసం సుజనమ్మ మృతదేహాన్ని కుమారుడు శేషయ్య, కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు.


