పీలేరులో వ్యక్తి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

పీలేరులో వ్యక్తి దారుణ హత్య

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

పీలేరు రూరల్‌ : పీలేరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. డీఎస్పీ ఎం.ఆర్‌.కృష్ణమోహన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు మార్గంలోని డిష్‌ కాలనీలో ఐదేళ్లుగా నివాసం ఉంటున్న ఎం.సుబ్రమణ్యం(45) పులిచెర్ల మండలం ఇ.రామిరెడ్డిగారిపల్లె పంచాయతీ చింతలవారిపల్లెలో చౌకదుకాణం డీలర్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం మదనపల్లె – తిరుపతి నాలుగు లేన్ల జాతీయ రహదారిపై మృతదేహం పడి ఉండగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మొదట రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే జాతీయ రహదారి నుంచి డిష్‌ కాలనీ వరకు పలు చోట్ల రక్తపు మరకలు ఉండటంతో.. హత్యగా భావించి డిష్‌ కాలనీకి చేరుకున్నారు. సుబ్రమణ్యం మృతిపై భార్య ఉమాదేవి(36), కుమారుడు లోహిత్‌ను పోలీసులు ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెప్పడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సుబ్రమణ్యం తండ్రి కృష్ణయ్య పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని కుమారుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. తన కోడలు ఉమాదేవికి వివాహేతర సంబంధాలు ఉండడంతో తరచూ గొడవులు జరిగేవని, తన కుమారుడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, సుబ్రమణ్యం మృతికి ఉమాదేవి కారణమని ఫిర్యాదు చేశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ తెలిపారు.

సుబ్రమణ్యం మృతిపై పలు అనుమానాలు

సుబ్రమణ్యంను హత్య చేసి సినీ ఫక్కీలో మృతదేహాన్ని జాతీయ రహదారి వద్దకు తీసుకెళ్లి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం పీలేరు పట్టణంలో కలకలం రేపంది. పోలీసులు సుబ్రమణ్యం ఇంటి వద్దకు చేరుకోగా ఉమాదేవి చేతికి గాయమై ఉండడం గమనించి ప్రశ్నించగా.. చెట్టుకొమ్మ తగిలి గాయమైందని పొంతనలేని సమాధానం చెప్పారు. సుబ్రమణ్యంను హత్య చేసే క్రమంలో ఆమెకు గాయమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమాదేవి వివాహేతర సంబంధానికి అడ్డుతొలగించుకోవడానికే సుబ్రమణ్యంను హత్య చేసినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని రోడ్డుపైకి ఎవరూ తరలించారో, హత్యకు ఎంత మంది పాల్పడ్డారో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఇన్‌చార్జి సీఐ లక్ష్మణ్‌, ఎస్‌ఐ రహీమ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సినీ ఫక్కీలో రోడ్డు ప్రమాదంగా

చిత్రీకరించే యత్నం

మృతదేహాన్ని జాతీయ రహదారిపై

పడేసిన వైనం

భార్య పాత్రపై అనుమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement