పుంగనూరు: మండలంలోని శాంతినగర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మీనా(32) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా , మీనా తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. మీనాను మెరుగైన చికిత్సకోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోగొట్టుకున్న బంగారు
ఆభరణాలు అప్పగింత
రాయచోటి టౌన్ : తమ బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నామని ఫిర్యాదు ఇచ్చిన వెంటనే రాయచోటి అర్బన్ పోలీసులు స్పందించి బాధితులకు అప్పగించారు. అర్బన్ సీఐ బీవీ చలపతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాయచోటి పట్టణం కొత్తపల్లె కరిమియా వీధికి చెందిన షేక్ మెహరాజ్, ఆరిఫుల్లా.. ఆ వీధిలో వెళ్తున్న ఆటోను ఆపి అందులో ప్రయాణించారు. బజార్‌కు వెళ్లిన ఇద్దరు ఆటోలో ఆరు తులాలు (60 గ్రాముల) బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి ఆభరణాలను ఒక బ్యాగ్‌లో ఉంచి మర్చిపోయి దిగి వెళ్లిపోయారు. ఆ విషయం గుర్తు తెచ్చుకొనేలోపు ఆటో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆందోళనతో పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు. సీఐ వెంటనే స్పందించి ఎస్‌ఐ విష్ణువర్ధన్‌తోపాటు మరి కొంత మంది సిబ్బందిని పురమాయించి సీసీ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఆటోను గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని.. ఆటోను తనిఖీ చేయగా వీరి ఆభరణాలు కనిపించాయి. సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను బాధితులకు అప్పగించడంతో వారు సంతోషంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
భూ రికార్డులు ట్యాంపరింగ్
చేసిన వీఆర్‌ఓపై కేసు
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : నిమ్మనపల్లె మండలంలోని రాచవేటివారిపల్లె పంచాయతీకి సంబంధించిన భూ రికార్డుల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించి, నిమ్మనపల్లె తహసీల్దార్ తపస్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై రామకృష్ణ కథనం మేరకు.. మండలంలోని రాచవీటివారిపల్లె పంచాయతీ వీఆర్‌ఓగా పని చేస్తున్న సోమశేఖర్ పంచాయతీకి సంబంధించిన ఏ–రిజిస్టర్ ట్యాంపరింగ్ చేసి నకళ్లు, సర్వే నంబర్లను తారుమారు చేసినట్లు తహసీల్దార్ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో తహసీల్దార్ రికార్డులను పరిశీలించి పలు సర్వే నంబర్లు, వాటికి సంబంధించిన భూముల వివరాలు, పేర్లను మార్చేసినట్లు గుర్తించారు. అనంతరం వీఆర్‌ఓపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్లో తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదుతో భూముల రికార్డుల ట్యాంపరింగ్‌పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. రికార్డుల్లో మార్పులు ఎప్పుడు, ఎలా జరిగాయి? వాటి వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది? ఏయే సర్వే నంబర్లకు సంబంధించిన భూముల వివరాలను మార్చారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రికార్డులను పరిశీలించి, సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు వివరించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.


