మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం కత్తివారిపల్లెలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. దీంతో నీళ్లకోసం గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయి వివాదానికి తెరలేపారు. తాగు నీటి బోరులో నీళ్లు అడుగంటడంతోనే ఈ సమస్య తలెత్తిందని ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. వివాదానికి సంబంధించి తాలూకా ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి కథనం మేరకు వివరాలు.. మండలంలోని మాలేపాడు పంచాయతీ కత్తివారిపల్లెలో సుమారు 150 కుటుంబాల ప్రజలు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి ఉన్న బోరులో కొంత కాలంగా నీళ్లు అడుగంటడంతో గ్రామానికి సరిపడ నీళ్లు రాక ప్రజలు కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రామానికి వేసిన బోరు తగ్గులో ఉన్న దళితవాడ దగ్గర ఉండటంతో.. నీళ్లు మిట్టపై ఉన్న బీసీలు వంతుల ప్రకారం పట్టుకుంటూ వస్తున్నారు. చివరకు బోరు మోటారు వేయడం నిలిపివేయడంతో నీళ్లు లేని కారణంగా గ్రామంలోని బీసీలు, దళితుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. నీటిని సర్దుకునే క్రమంలో అగ్రవర్ణాల వారు స్టార్టర్‌లో ఫ్యూజులు పీకేసి నీరు రాకుండా చేశారని దళితులు అపార్థం చేసుకున్నారు. దీంతో వారు సీపీఎం నాయకులు శ్రీనివాసులును గ్రామానికి పిలిపించి.. దళితులకు మాత్రమే నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి, గ్రామస్తులతో మాట్లాడి వివాదం తలెత్తకుండా సర్ది చెప్పారు. దీన్ని కొందరు వివక్షగా అభివర్ణించారు. కత్తివారిపల్లిలో సుమారు 80 దళిత కుటుంబాలకు తాగునీరు రాకుండా అదే ఊరికి చెందిన అగ్రవర్ణ కులస్తులు స్టార్టర్‌కు ఫ్యూజులను వారం క్రితం తొలగించారని సీపీఎం నాయకుడు శ్రీనివాసులు ఆరోపించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొందని, అధికారులు స్పందించకపోతే ఆందోళనలకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. అయితే ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి గ్రామంలో వివక్ష ఏమీ లేదని చెప్పుకొచ్చారు. బోరులో తాగునీరు అడుగంటడంతోనే సమస్య తలెత్తిందన్నారు. ఎంపీడీఓతో మాట్లాడి తాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగు నీటి సమస్య పరిష్కారానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
రెండు వర్గాలుగా చీలిపోయిన గ్రామస్తులు
వారం రోజులుగా అల్లాడుతున్న జనం


